నేడు పెన్నాకు నీరు విడుదల

4 Sep, 2019 07:47 IST|Sakshi

గండికోట నుంచి రోజుకు 5000 క్యూసెక్కులు 

మైలవరం జలాశయంలో 3 టీఎంసీల నిల్వ 

సాక్షి, జమ్మలమడుగు(కడప) : మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి రెండు టీఎంసీల నీరు విడుదల చేయడం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రెండున్నర టీఎంసీల పైన నీరు ఉండగా, మంగళవారం రాత్రికి మూడు టీఎంసీలకు చేరుకుంటుంది. ముందుగా గండికోట జలాశయం నుంచి మైలవరంలోకి ఇరిగేషన్‌ అధికారులు కేవలం 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. తర్వాత 1500 క్యూసెక్కులు విడుదల చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సెప్టెంబర్‌ 1 నుంచి మైలవరం గేట్లు ఎత్తి పెన్నానదిలోకి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే అధికారులు ఆ స్థాయిలో గండికోట నుంచి మైలవరం జలాశయంలోకి నీరు విడుదల చేయలేదు. ఇరిగేషన్‌ అధికారులు తమపై పక్షపాతం చూపుతున్నారని రెండు రోజుల్లో మైలవరం నుంచి పెన్నానదిలోకి విడుదల చేయకపోతే ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులు రోజుకు 1500 క్యూసెక్కుల వచ్చే నీటిని 5000 క్యూసెక్కులకు పెంచేశారు. నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుంది.

రెండు గేట్ల ద్వారా..
మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి రెండు టీఎంసీల నీటిని విడుదల చేయబోతున్నారు. రెండు గేట్ల ద్వారా ప్రతిరోజు 1000 క్యూసెక్కుల నీటిని పెన్నానదిలో నీటిని విడుదల చేసి భూగర్భజలాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుంది. అంతే కాకుండా జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లోని గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగి తాగునీటితో పాటు రైతుల బోర్లకు నీరు అందే అవకాశం ఉంది.

6.5 టీఎంసీల నిల్వకు ప్రయత్నాలు..
మైలవరం రిజర్వాయర్‌ కింద ఉన్న ఆయకట్టు రైతులకు, తాగునీరు, ఆర్టీపీపీలకు నీరు అందించే విధంగా జలాశయంలో దాదాపు 6.5 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే విధంగా అధికారులు సిద్ధమవుతున్నారు. మైలవరం జలాశయం మొత్తం సామర్థ్యం 9.5 టీఎంసీలు అయితే ప్రస్తుతం 6.5 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

నీటిని విడుదల చేయనున్న ఎంపీ, ఎమ్మెల్యేలు..
మైలవరం జలాశయం నుంచి బుధవారం ఉద యం పది గంటలకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్‌ అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రమే విడుదల చేయాల్సి ఉన్నా పూర్తి స్థాయిలో నీరు వచ్చి చేరకపోవడంతో కార్యక్రమాన్ని బుధవారం ఉదయానికి వాయిదా వేశా రు. నీటి విడుదలకు ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి హాజరవుతున్నట్లు సమాచారం.

ఇబ్బందులు లేకుండా చర్యలు..
మైలవరం జలాశయం నుంచి రెండు టీఎంసీల నీటిని పెన్నానదిలోకి వదలి భూగర్భజలాలు పెరిగి భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా బుధవారం ఉదయం మైలవరం జలాశయం గేట్లను ఎత్తి పెన్నానదిలోకి విడుదల చేయబోతున్నాం. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు వస్తున్నారు.
 – గౌతమ్‌రెడ్డి, మైలవరం ఇరిగేషన్‌ ఏఈ  

మరిన్ని వార్తలు