పోలవరానికి వరద ‘వర్రీ’!

12 Jun, 2019 03:53 IST|Sakshi
పోలవరం ప్రాజెక్ట్‌

గోదావరికి వరద హెచ్చరికలతో జలవనరులశాఖ అప్రమత్తం

యుద్ధప్రాతిపదికన చర్యలకు సమాయత్తం

ఇప్పటిదాకా చేసిన పనులు ముంపు బారిన పడకుండా కాపాడాలని సీడబ్ల్యూసీ,డీడీఆర్‌పీ ఆదేశం

ఇండో–కెనడియన్‌ సంస్థ సిఫార్సులకు ఆమోదం

సాక్షి, అమరావతి: గోదావరి వరదతో ఉప్పొంగేలోగా పోలవరం ప్రాజెక్టులో ఇప్పటిదాకా చేసిన పనులను రక్షించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌) పునాది (డయాఫ్రమ్‌ వాల్‌), స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులను వరద ముప్పు నుంచి రక్షిస్తూనే వరద ప్రవాహం సహజసిద్ధంగా దిగువకు వెళ్లేలా చేయడంపై ఇండో–కెనడియన్‌ సంస్థ 3–డీ పద్ధతిలో అధ్యయనం చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులను వరద ముప్పు నుంచి కాపాడేందుకు ఆ సంస్థ చేసిన సూచనలను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), డీడీఆర్‌పీ(డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌) సోమవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆమోదించాయి. వీటిని తక్షణమే అమలు చేయాలని జలవనరులశాఖను ఆదేశించారు. వరద ఉధృతితో పోలవరం వద్ద నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు జూలై 15వతేదీలోగా పునరావాసం కల్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద యుద్దప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టడానికి జలవనరుల శాఖ సిద్ధమైంది.  

ఎన్నికల ముందు టీడీపీ హడావుడి పనులు 
పోలవరం జలాశయాన్ని గోదావరిపై పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద నిర్మిస్తున్నారు. గోదావరి నదీ గర్భంలో ఇసుక తిన్నెలపై 2,454 మీటర్ల పొడవున నిర్మించే ఈసీఆర్‌ఎఫ్‌(రాతి మట్టి కట్ట)లోనే జలాశయంలో 194.6 టీఎంసీలను నిల్వ చేయనున్నారు. ఇందుకు ఈసీఆర్‌ఎఫ్‌కు 500 మీటర్ల ఎగువన 2,480 మీటర్ల పొడవున ఒక కాఫర్‌ డ్యామ్, 500 మీటర్ల దిగువన 1,660 మీటర్ల పొడవున మరో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలి. పోలవరం పనులు పూర్తయ్యేలోగా ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో నీటిని నిల్వ చేసి 2018 మే నెల నాటికే గ్రావిటీపై ఆయకట్టుకు నీళ్లందిస్తామని మాజీ సీఎం చంద్రబాబు 2016 సెప్టెంబరు 30న హామీ ఇచ్చారు. అయితే వరద మళ్లింపు కోసం తాత్కాలిక పద్ధతిలో నిర్మించే కాఫర్‌ డ్యామ్‌లో నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. టీడీపీ హయాంలో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 42.5 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి సీడబ్ల్యూసీ షరతులతో అనుమతించగా గతేడాది మే నాటికి కనీసం పనులు కూడా ప్రారంభం కాలేదు. ఎన్నికల ముందు హడావుడిగా చేపట్టినా కనీసం సగం కూడా పూర్తి కాలేదు. గత నెల 28న పనులను పరిశీలించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో  ఇప్పటిదాకా చేసిన వాటిని రక్షించుకోవడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించింది. 

వరద నుంచి కాపాడేందుకు ఇండో–కెనడియన్‌ సంస్థ సిఫార్సులు ఇవీ
– కాఫర్‌ డ్యామ్‌లకు ఎగువన మీటర్‌ లోతు, మూడు మీటర్ల వెడల్పున బండరాళ్లతో ఓ పొరను నిర్మించాలి. దిగువన మీటర్‌ లోతు, పది మీటర్ల వెడల్పున బండరాళ్లతో మరో పొరను నిర్మించాలి. దీనివల్ల కాఫర్‌ డ్యామ్‌ల వద్ద కోత ప్రభావం ఉండదు. లీకేజీల సమస్యనూ అరికట్టవచ్చు. 
– వరద ఉధృతి తీవ్రత కాఫర్‌ డ్యామ్‌లపై తక్కువగా ఉండాలంటే ఎగువన, దిగువున గోదావరి గర్భంలో ఒక మీటర్‌ వెడల్పు, రెండు మీటర్ల ఎత్తుతో 20 మీటర్ల పొడవున స్పర్స్‌ (పిట్టగోడ)లను నిర్మించాలి. దీనివల్ల వరద ప్రవాహం చీలిపోయి కాఫర్‌ డ్యామ్‌లపై ప్రభావం తక్కువగా ఉంటుంది. 
– స్పిల్‌ వే రివర్స్‌ స్లూయిస్‌ గేట్లను బిగించకూడదు. దీనివల్ల వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు వెళుతుంది. వరద ప్రారంభమయ్యేలోగా స్పిల్‌ వేకు 48 బ్లాక్‌లలో 30 మీటర్ల లోతుతో గ్రౌటింగ్‌ చేయడం వల్ల అంతర్గత ప్రవాహాలను అరికట్టవచ్చు. 
– కాఫర్‌ డ్యామ్‌ రీచ్‌–1, రీచ్‌–3లో ఖాళీ ప్రదేశాల (ప్రారంభించని పనులు) ద్వారా వరద దిగువకు వెళ్తుంది. వరద ఉధృతితో ఖాళీ ప్రదేశాలకు ఇరు వైపులా కాఫర్‌ డ్యామ్‌ కొంతవరకూ కోతకు గురయ్యే అవకాశం ఉన్నా  ప్రవాహ వేగం తగ్గాక సరిచేయవచ్చు.  

మరిన్ని వార్తలు