నిర్వాసితులకే ఖర్చు ఎక్కువ

14 Apr, 2016 01:14 IST|Sakshi
నిర్వాసితులకే ఖర్చు ఎక్కువ

♦ ‘పోలవరం’ ముంపు బాధితుల పునరావాసం, భూమికే సింహభాగం నిధులు వ్యయం: సీఎం  
♦ కొత్త చట్టం ప్రకారం పరిహారమివ్వలేం
♦ ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నాం
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు/కాకినాడ/చింతూరు: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కంటే ముంపు బాధితులకు పునరావాస చర్యలు, భూమికి భూమి, తదితర కార్యక్రమాలకే ఎక్కువ ఖర్చవుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. విలీన మండలాలైన తూర్పుగోదావరి జిల్లా చింతూరు, పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం కివ్వాకలో బుధవారం వేర్వేరుగా జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినందున అవసరమైన నిధుల విడుదలకు కేంద్రం సహకరించాలని కోరారు.

 ఆ రుణాలు చెల్లించలేం..: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో గతంలో పరిహారం పొందిన వారికి ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం తిరిగి పరిహారం చెల్లించే అవకాశం లేదని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికీ పరి హారం అందని వారికి మాత్రమే 2013 చట్టం ప్రకారం పరిహారం అందజేస్తామన్నారు.

 దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగా వెనుకబడి ఉందని సీఎం చెప్పారు. అంతకుముందు చింతూరు కేంద్రంగా చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొత్త ఐటీడీఏని సీఎం ప్రారంభించారు.

 అన్నీ చేస్తా.. కూర్చో: చింతూరు సభలో ‘పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ భాగమని చెబుతున్నారు.. అలాంటప్పుడు పట్టిసీమలో అమలు చేసిన ప్యాకేజీనే పోలవరం నిర్వాసితులకు ఇవ్వండి.. హామీలు కాదు ఆచరణలో చూపించండి’ అని పోలవరం నిర్వాసితుల సంఘం నాయకుడొకరు చేసిన నినాదాలు ముఖ్యమంత్రికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ‘అన్నీ చేస్తా.. కూర్చో, నువ్వు కూర్చో! అక్కడ కాదు ఇక్కడికి (వేదిక పైకి) వచ్చి చెప్పు. ఇలా రెచ్చగొట్టేవారు ఉంటారని ముందే చెప్పా’ అని తీవ్రస్వరంతో అంటూ ప్రసంగాన్ని సీఎం ముగించారు.

 దళిత సంఘాల ఆందోళన
 చింతూరు మెయిన్‌రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహానికి సీఎంతో పూలమాల వేయించడానికి దళిత సంఘాల నాయకులు ఏర్పాటు చేశారు. అయితే సీఎం అక్కడ ఆగకుండా పది అడుగుల దూరంలో ఉన్న ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద ఆగి పూలమాల వేశారు. దీంతో నిరాశ చెందిన దళిత సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత నిరసన ప్రదర్శన నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

>
మరిన్ని వార్తలు