రాయలసీమ గడగడ!

22 May, 2019 10:41 IST|Sakshi

నేడు, రేపు పిడుగులు... ఆపై వడగాడ్పులు

సాక్షి, విశాఖపట్నం: రాయలసీమను వాతావరణం గడగడలాడించనుంది. బుధ, గురువారాల్లో పిడుగులు, ఆ తర్వాత రెండు రోజులు వడగాడ్పులతో దడ పుట్టించనుంది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే కర్ణాటక నుంచి కొమరిన్‌ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

ఆవర్తనం, ద్రోణిల ప్రభావంతో బుధవారం, గురువారం రాయలసీమలో గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో పిడుగులు కూడా పడతాయని ఐఎండీ మంగళవారం వెల్లడించింది. శుక్ర, శనివారాల్లో రాయలసీమలో ఉష్ణోగ్రతలు మరింతగా విజృంభిస్తాయని, సాధారణం కంటే 3–5 డిగ్రీలు అధికంగా నమోదయి చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. అందువల్ల రాయలసీమ ప్రజలు పిడుగులు, వడగాడ్పుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోస్తాంధ్రలో మాత్రం బుధ, గురువారాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది.
 

కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురి మృతి

కర్నూలు జిల్లాలో మంగళవారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. హాలహర్వి మండలం చింతకుంట గ్రామానికి చెందిన బారిక శ్రీనివాసులు(50) అనే గొర్రెల కాపరి, ఆస్పరి మండలం మత్తుకూరు గ్రామానికి  చెందిన రంగప్ప (39) అనే రైతు, కోవెలకుంట్ల మండలం కలుగోట్ల గ్రామానికి చెందిన జాఫర్‌ (30) అనే మేకల కాపరి పిడుగులకు బలయ్యారు. 

మరిన్ని వార్తలు