విస్తారంగా వర్షాలు

12 Aug, 2018 04:19 IST|Sakshi

పలుచోట్ల కుంభవృష్టి

విజయనగరంలో రోడ్లన్నీ జలమయం

‘కృష్ణా’లో ఆక్వా రంగానికి దెబ్బ మీద దెబ్బ

శ్రీకాకుళంలో స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లకు అంతరాయం

ఊపిరిపోసుకున్న పంటలు

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంవల్ల రాష్ట్రవ్యాప్తంగా శనివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల మంచి వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో ఒకటి రెండుచోట్ల 7 నుంచి 9 సెం.మీ. వర్షం కురిసింది. వైఎస్సార్, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస మండలాల్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్‌.ఎన్‌.పేట మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు స్పృహ కోల్పోయారు. శ్రీకాకుళంలో కురిసిన వర్షంతో ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లకు అంతరాయం కలిగింది. విజయనగరంలో శనివారం మధ్యాహ్నం గంటన్నరపాటు కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఓ మోస్తరుగానూ.. మరికొన్నిచోట్ల చిరుజల్లులుగానూ కురిసింది. 

‘కృష్ణా’లో ఆక్వాకు దెబ్బ
కృష్ణాజిల్లాలో రెండు రోజులుగా వర్షం కురవడంతో జిల్లాలో సగటు వర్షపాతం 41.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యధికంగా వత్సవాయిలో 122.6 మి.మీ.. అత్యల్పంగా కైకలూరులో 5.2 మి.మీ.లు నమోదైంది. పంటకు గిట్టుబాటు ధరలేక, వైరస్‌ బెడదతో తుడిచిపెట్టుకుపోయిన ఆక్వా రంగం వర్షాల కారణంగా మరింత నష్టాల్లోకి కూరుకుపోనుంది. రొయ్యలకు అవసరమైన ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోంది. దాన్ని నివారించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా కొద్దిపాటి వర్షాలకే రహదారులు జలమయమయ్యాయి. పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో నీరు రోడ్లపైకి చేరుతోంది. అలాగే, గుంటూరు జిల్లాలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో సగటున 6.26 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బెల్లంకొండ మండలంలో 11.98, అత్యల్పంగా 1.28 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల చెట్లు కూలిపోగా, పెదనందిపాడులో పెంకుటిల్లు కూలిపోయింది. ఇదిలా ఉంటే.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎండిపోతున్న పంటలకు కొంత ఊరట కలిగింది. అయితే, ఇంకా సాగు చెయ్యాలన్నా, ఉన్న పంటలకు నీరు కావాలన్నా వర్షాలు విస్తారంగా కురవాల్సిన అవసరం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. 

నేడు కోస్తాంధ్రలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం : జార్ఖండ్‌ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఒడిశా మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు ఊపందుకున్నాయి. అదే సమయంలో దక్షిణ ఒడిశా–ఉత్తర కోస్తాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలో బలంగాను, రాయలసీమలో చురుగ్గాను ఉన్నాయి. వీటన్నిటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో తెలిపింది. ఆదివారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలకు అస్కారం ఉందని పేర్కొంది. గడచిన 24 గంటల్లో వరరామచంద్రపురంలో అత్యధికంగా 13 సెం.మీల భారీ వర్షం కురిసింది. కొయిడ, చింతూరుల్లో 12, సత్తెనపల్లిలో 10, కూనవరంలో 10, అవనిగడ్డ, రేపల్లెల్లో 9, విశాఖపట్నం, వేలేరుపాడు, సంతమగుళూరు, మాచెర్లలో 8, బాపట్ల, అద్దంకి, కొయ్యలగూడెం, ఎర్రగొండపాలెం, కుకునూరుల్లో 7, కారంచేడు, పిడుగురాళ్లలో 6, నందిగామ, పాలేరు బ్రిడ్డి, గుడివాడ, పలాస, రాజుపాలెంలలో 5 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. 

మరిన్ని వార్తలు