సోనియా కృషితోనే తెలంగాణ

3 Oct, 2013 06:12 IST|Sakshi

 బోధన్,న్యూస్‌లైన్ : ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ కృషితోనే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కాబోతోందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్  అధిష్టానం, యుపీఏ ప్రభుత్వం తెలంగాణకు కట్టుబడి ఉన్నాయన్నారు. మంగళవారం బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తా, తట్టికోట కాలనీలో మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
 
 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక పథకాలు అమలు చేస్తోం దన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాం లో వృద్ధాప్య పింఛన్ నెలకు  75 రూపా యలు ఉండగా, తమ ప్రభుత్వం దానిని రెండు వందల రూపాయలకు పెంచినట్లు చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. పట్టణ వాసుల సాగు, తాగు నీటికి ఆధారమైన బెల్లాల్ చెరువుకు మరమ్మతులు చేయించి నీటి సమస్యను పరిష్కరించానని తెలిపారు. రబీకి నిజాంసాగర్ నీళ్లు అందిస్తామని వెల్లడించారు . సాగర్ నీటిని రైతులు వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచిం చారు. ఈ సందర్భంగా ఇదే కాలనీకి చెంది న సూర లింగారెడ్డి మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు . కార్యక్రమంలో ఎఎంసీ చైర్మన్ గంగాశంకర్, సీడీసీ చైర్మన్ పోతారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పాషామోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు