రాజీయే రాచమార్గం

11 Jan, 2016 01:30 IST|Sakshi

లోక్‌అదాలత్‌లతో బాధితులకు సత్వర న్యాయం
 
మదనపల్లె రూరల్ : రాజీయే రాజ మార్గమని పెద్దలు చెప్పారు. ఇప్పుడు చట్టాలు అందుకు అనుకగుణంగానే ఉన్నా యి. బాధితులను కోర్టుల చుట్టూ తిప్పడం కంటే రాజీతో కేసులు పరిష్కారం చేయాలని నూతన విధానాన్ని అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నారు. తద్వారా ఇరువర్గాలను రాజీ కుదిర్చి అప్పటికప్పుడే కేసులు పరిష్కరిస్తున్నారు. అంతేకాకుండా బాధితులకు తక్షణ సాయంగా పరిహారం అందజేస్తూ న్యాయస్థానాలు మరో అడుగు ముందుకేస్తున్నాయి.

ఇక్కడ పరిష్కారమైన కేసులపై తిరిగి పైకోర్టులను ఆశ్రయించిన దాఖలాలు లేకపోవడంతో లోక్ అదాలత్‌లు విజయవంతమైనట్టే చెప్పవచ్చని న్యాయ వాదులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన వందల కేసులకు పరిష్కారమార్గం లభిస్తోంది. జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు జిల్లాలోని 51 కోర్టుల్లో జాతీయ, మెగా లోక్ అదాలత్‌లు 8,092 నిర్వహించగా అందులో 5,075 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ కేసుల్లో బాధితులకు పరిహారంగా రూ.50 కోట్లను అందజేసి రికార్డులు బద్దలు కొట్టారు. అలాంటి వాటిలో ప్రధానంగా క్రిమినల్ కేసులు 3,270, సివిల్ కేసులు 670, ఎన్‌ఓపీలు169, పీఎల్‌పీలు 853, ఎక్సైజ్ 113 కేసులు పరిష్కారమయ్యాయని అధికారులు తెలిపారు.  
 

>
మరిన్ని వార్తలు