నెల్లూరు జీజీహెచ్‌లో దారుణం

3 May, 2019 02:05 IST|Sakshi

గుర్తుతెలియని మహిళ మృతి 

ఆలస్యంగా గుర్తించిన సిబ్బంది

అప్పటికే మృతురాలి కాళ్లను తినేసిన కుక్కలు, పందులు

పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మార్చురీకి తరలింపు  

నెల్లూరు(బారకాసు): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం కాళ్లను కుక్కలు, పందులు పీక్కు తినేసిన ఘటన పలువురిని తీవ్రంగా కలచివేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయవిదారక ఘటన ఆస్పత్రిలోని మెటర్నిటీ విభాగం భవనానికి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో చోటు చేసుకుంది. అక్కడున్నవారు చెబుతున్న వివరాల ప్రకారం.. సుమారు 50 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ అనారోగ్య కారణంగా చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు మూడురోజుల క్రితం వచ్చింది. ఆమె ఆస్పత్రి భవనం ఎదురుగా ఉన్న ప్రాంగణంలోని చెట్ల కింద సేద తీరేది. అక్కడే ఉన్న అనేక మంది రోగుల అటెండర్లు ఆమెను చూశారు. అయితే వివరాలు ఎవరికీ తెలియదు. ఆమె బుధవారం రాత్రి మృతి చెందినా ఎవరూ గుర్తించలేదు. ఆమె నిద్రపోతోందని భావించారు. గురువారం ఉదయం శానిటేషన్‌ సిబ్బంది చూడగా ఆమె కాళ్లను కుక్కలు, పందులు పీక్కు తినేసి ఉన్నాయి.

మృతదేహంపై దుస్తులు లేవు. శానిటేషన్‌ సిబ్బంది ఆస్పత్రి అధికారులకు విషయాన్ని తెలియజేశారు. దీంతో అధికారులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వచ్చి మృతదేహాన్ని చూసి కేసు నమోదు చేసుకున్న అనంతరం మార్చురీకి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందనే విమర్శలున్నాయి. కొంతమంది వృద్ధ అనాథలు ఇక్కడి ప్రాంగణంలోకి వచ్చి మృతి చెందడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. వైద్య కళాశాలకు సంబంధించి 120 మంది సిబ్బంది ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని ఆస్పత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులు విమర్శలు గుప్పిస్తున్నారు. 

గుర్తించి చర్యలు తీసుకున్నాం..  
జీజీహెచ్‌ ప్రాంగణంలో ఉన్న మెటర్నిటీ విభాగపు భవనానికి ఎదురుగా ఉన్న ప్రాంగణంలోని చెట్ల కింద రోజూ రోగుల అటెండెంట్లు సేద తీరుతుంటారు. అయితే ఎవరో గుర్తు తెలియని ఓ మహిళ బుధవారం రోజున వచ్చి ఆచెట్ల కింద ఉన్నట్లుంది. అదేరోజు రాత్రి మృతి చెందినట్లు భావిస్తున్నాం. గురువారం ఉదయం 6గంటలకు శానిటేషన్‌ సిబ్బంది గుర్తించి తమకు తెలియజేయగా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఎవరైనా గుర్తుపట్టి వస్తే మృతదేహాన్ని అప్పగిస్తాం. సమాచారం తెలిసిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలన్నీ తక్షణమే తీసుకున్నాం. –డాక్టర్‌ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి  

మరిన్ని వార్తలు