Andhra Pradesh: సర్కారు ఆస్పత్రులు సరికొత్తగా..

6 Nov, 2023 12:07 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్యరంగానికి పెద్దపీట వేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేపట్టింది. అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేయడంతోపాటు మౌలిక వసతులను సైతం కల్పించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారు ఆస్పత్రుల్లోని వైద్యులు రోగులకు ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వాస్పత్రుల్లో ప్రస్తుతం ఉత్తమ వైద్యసేవలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యమే పరమావధిగా సకల సౌకర్యాలతో రోగులకు సేవలందిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల వరకు అన్ని సర్కారు ఆస్పత్రుల్లో మౌలిక వసతులతోపాటు అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసింది. పూర్తిస్థాయిలో వైద్యు లు, సిబ్బందిని నియమించి నాణ్యమైన వైద్యం అందిస్తుండడంతో గత నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య రెండు రెట్లు పెరిగింది.

జీజీహెచ్‌లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు
నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్‌)లో రోగులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతున్నాయి. ప్రభుత్వం ఆయా విభాగాల్లో అధునాతన పరికరాలను ఏర్పాటు చేయడంతో వైద్యులు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నారు. 2019కు ముందు కేవలం ఒక సీటీ స్కాన్‌, ఒక ఎక్సరే పరికరాలు ఉండేవి. అవి కూడా సక్రమంగా పనిచేసేవి కావు. దీంతో జీజీహెచ్‌కు వచ్చిన రోగులు సీటీ స్కాన్‌, ఎక్సరేల కోసం బయట సెంటర్లకు వెళ్లేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన సీటీ స్కాన్‌, ఎక్సరే, ఎంఆర్‌ఐ పరికరాలను ఏర్పాటు చేశారు. రక్తపరీక్షల సంఖ్యను పెంచారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. 20 ఫ్రీజర్‌లను ప్రభుత్వం అందజేసింది. రూ.10 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ నిర్మాణంలో ఉంది. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీట్లను 175కు పెంచారు. అలాగే పిడియాట్రిక్‌, అనస్తీషియా, పల్మనాలజీ విభాగాల్లో పీజీ సీట్లను తీసుకొచ్చారు.

యూపీహెచ్‌సీలకు అధునాతన హంగులు
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్‌లు ఉండగా, దాదాపు 9 లక్షల మందికి పైగా జనాభా ఉన్నారు. 2019 వరకు కార్పొరేషన్‌ పరిధిలో కేవలం 8 ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉండేవి. వాటి నిర్వహణ తూతూమంత్రంగా ఉండేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 13 నూతన అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లను (యూపీహెచ్‌సీలను)అధునాతన హంగులతో నిర్మించింది. ఒక్కో భవనానికి రూ.1.10 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చించింది. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ, మందులు గది, ల్యాబ్‌, ప్రత్యేక వార్డు, డెలివరీ గదిని ప్రత్యేకంగా నిర్మించింది. పాత ఆరోగ్య కేంద్రాలకు నిధులు వెచ్చించి మరమ్మతులు చేసింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

కరోనాలోనూ ఉత్తమ వైద్యసేవలు
కోవిడ్‌–19 సమయంలో జీజీహెచ్‌లోని వైద్యులు, సిబ్బంది, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో రోగులకు ఉత్తమ సేవలు అందించారు. కోవిడ్‌ బారిన పడిన వారికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైదసేవలు అందించారు.

ఇతని పేరు పెంచలనాయుడు. ఇతనిది పొదలకూరు. ఇటీవల ఇంట్లో కాలు జారి కింద పడ్డాడు. చెయ్యి విరగడంతో జీజీహెచ్‌కు వెళ్లాడు. అక్కడ ఆర్థో విభాగం వైద్యులు పరీక్షించి చెయ్యి విరిగిన చోట ఆపరేషన్‌ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగుంది. దాదాపు పది రోజులుగా జీజీహెచ్‌లో ఉన్నాడు. డాక్టర్లు ఉచిత వైద్యసేవలు అందించడమే కాకుండా ప్రతి పూట భోజనం పెట్టారు. అలాగే ప్రభుత్వం నుంచి రూ.4,720 వరకు ఆర్థికసాయం అందింది.

 

ఇతని పేరు నాగరాజు. ఇతనిది నెల్లూరు నగరం. గత కొంతకాలంగా పైల్స్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళితే వైద్యానికి రూ.50 వేలు ఖర్చవుతుందని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరులోని జీజీహెచ్‌కు వెళ్లాడు. వైద్యులు పరీక్షలు చేసి సమస్యను గుర్తించారు. తక్షణమే చికిత్స చేసేందుకు ముందుకువచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేసేందుకు నిర్ణయించారు.


 

రోగులకు అన్ని సౌకర్యాలు
నాడు–నేడు కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. హాస్పిటల్‌కు వచ్చే రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అన్ని ఏసీలు పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. 10 లిఫ్ట్‌ లు పనిచేస్తున్నాయి. అధునాతన పరికరాలతో సేవలు అందిస్తున్నాం.
– సిద్ధానాయక్‌, జీజీహెచ్‌, సూపరింటెండెంట్‌
 

సేవ చేయడానికి ముందున్నాం
జీజీహెచ్‌కు వైద్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. అర్ధరాత్రి ఫోన్‌ చేసినా స్పందిస్తాను. హాస్పిటల్‌లో ఎన్నో క్లిష్టమైన డెలివరీలు చేశాం. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి సహాయ, సహకారాలతో పేదలకు మంచి వైద్యం అందిస్తున్నాం.
– లక్ష్మీ సునంద, జీజీహెచ్‌ హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ కోఆర్డినేటర్‌

 

మరిన్ని వార్తలు