‘నువ్వు కూడా ఉండొచ్చు..కాకుంటే ...’

26 Jul, 2014 13:02 IST|Sakshi
‘నువ్వు కూడా ఉండొచ్చు..కాకుంటే ...’

విజయవాడ  :  పదేళ్లు ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత బుద్ధి వక్రీకరించి మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ‘నువ్వు కూడా ఉండొచ్చు..కాకుంటే షరతులు వర్తిస్తాయి’ అనడంతో గత్యంతరం లేని స్థితిలో ఆమె న్యాయం కోసం విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించింది.  వివరాల్లోకి వెళితే  పటమట రామచంద్రానగర్‌కు చెందిన కొప్పురావూరి సంధ్యారాణి తన భర్త నవీన్‌కుమార్ రెండున్నర నెలల కిందట వదిలేసి వెళ్లాడని పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులును కలిసి ఫిర్యాదు చేసింది.

భర్త గవర్నరుపేటలోని తన మామ కొప్పురావూరి నటరాజు ఇంట్లో ఉంటున్నాడని, తన రెండున్నరేళ్ల కుమార్తె శ్రీ చిన్విని కూడా అక్కడే ఉంచుకొని చూపించడం లేదని ఆమె పేర్కొంది. రెండో పెళ్లికి సిద్ధపడిన తన భర్త పేరొందిన న్యాయవాది పేరు చెపుతూ తననేమీ చేయలేరంటూ బెదిరిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తన కుమార్తెనైనా చూ పించాలంటూ పోలీస్ కమిషనర్‌ను ఆమె వేడుకుంది. దీనిపై మహిళా పోలీ సు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

 ఇదీ జరిగింది

2001లో సంధ్యారాణి ఇంటర్మీడియెట్ చదువుతుండగా బియ్యం వ్యాపారి నట రాజు కుమారుడు నవీన్‌కుమార్‌తో స్నే హితుల ద్వారా పరిచయమైంది. తరువాత ప్రేమలో పడిన వీరు 2010లో కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి రామచంద్రానగర్‌లో ఉంటున్నారు. వీరికి రెండున్నరేళ్ల శ్రీ చిన్వి, మూడు నెలల జిజ్ఞేశ్వర్ సం తానం. నవీన్ గత మే 16న కుమార్తెను తీసుకొని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. పలుమార్లు వెళ్లి ప్రాథేయపడినా రాకపోగా, కుమార్తెను కూడా చూ పించడం లేదు. ఇందుకు తన మామే కారణమని ఆమె పేర్కొంది. తన మామ బలవంతంతో మరో వివాహం చేసుకునేందుకు నవీన్ ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది.

 షరతులు పెడుతున్నాడు

తన కుమార్తెను చూపించేందుకు భర్త షరతులు పెడుతున్నాడని సంధ్యారాణి ఆరోపిస్తోంది. రెండో వివాహం ఇష్టమేనని, ఆస్తిలో వాటా అడగనని, భవిష్యత్‌లో అత్తమామలపై పోలీసులకు ఏ విధమైన ఫిర్యాదు చేయకూడదంటూ ఒప్పంద పత్రంపై సంతకం పెట్టాలంటున్నట్టు ఆమె పేర్కొంది. ఇది జరిగితే కుటుంబ ఖర్చులు పెట్టుకొని వారంలో ఒకరోజు పాపను తీసుకువచ్చి తన ఇంట్లో గడుపుతానని చెపుతున్నాడని, ఇలా చేయకపోతే పిల్లలు తనకు పుట్టలేదని ప్రచారం చేస్తారని బెదిరిస్తున్నాడని ఆమె కన్నీటి పర్యంతమైంది.

మరిన్ని వార్తలు