మత్తు మందిచ్చి దోపిడీ 

31 Aug, 2019 09:35 IST|Sakshi
బాధిత మహిళ ఎలీసె

నేత్రావతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఘటన  

బాధితులు కేరళ మహిళలు 

సాక్షి, గుంతకల్లు: నేత్రావతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇద్దరు మహిళా ప్రయాణికులకు అపరిచిత వ్యక్తి టీలో మత్తుమందు కలిపిచ్చి.. నిలువు దోపిడీకి చేశాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేరళ రాష్ట్రం కొట్టాయంకు చెందిన మారియమ్మ, ఎలీసె అనే వృద్ధ మహిళలు స్వగ్రామం వెళ్లేందుకు గురువారం ఛత్రపతి శివాజీ టర్మినల్‌ – తిరువనంతపురం వెళ్లే నేత్రావతి ఎక్స్‌ప్రెస్‌ (రైలు నంబర్‌ – 16345) ఎక్కారు. బీ2 కోచ్‌లో 61, 65 నంబర్‌సీట్లలో కూర్చున్నారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో లోనవాలా రైల్వేస్టేషన్‌కు చేరిన సమయంలో ఓ అపరిచిత వ్యక్తి వీరితో మాటామంతీ కలిపి మత్తుమందు కలిపిన టీ ఇచ్చాడు. టీ తాగిన తర్వాత ఇద్దరూ స్పృహ కోల్పోయారు. మారియమ్మ, ఎలీసె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపరిచిత వ్యక్తి దోచుకునివెళ్లాడు.

అపస్మారకస్థితిలో ఉన్న ఇద్దరు మహిళలను శుక్రవారం ఉదయం కొప్పగల్లు రైల్వేస్టేషన్‌లో తోటి ప్రయాణికులు గుర్తించి గుంతకల్లు రైల్వే అధికారులకు సమాచారమందించారు. రైలు 11.15 గంటలకు గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. జంక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న టీటీఈ కిషోర్‌ కోచ్‌లోకి వెళ్లి స్పృహ కోల్పోయిన మారియమ్మ, ఎలీసెలను 108 వాహనంలో స్థానిక రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికీ బాధితులు అపస్మారక స్థితిలోనే ఉండటంతో నగల విలువ తెలియరాలేదు.

3 గంటలు అంబులెన్స్‌లోనే.... 
మత్తు మందు ప్రభావంతో స్పృహ కోల్పోయిన మారియమ్మ, ఎలీసెలను 11.30 గంటలకు 108 సిబ్బంది రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే సం బంధిత రైలులో విధి నిర్వహణలో ఉన్న టీటీఈ నుంచి ఎలాంటి సమాచారం అందనందున తాము వైద్య సేవలందించలేమని సిబ్బంది మొండికేశారు. నేత్రావతి ఎక్స్‌ప్రెస్‌ రైలు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా గుంతకల్లు మీదుగా మళ్లించారు. దీంతో ఆ రైలులో టీటీఈలు కూడా ఎవరూ లేరని తెలిసింది. ఈ కారణంగానే కంట్రోల్‌ రూం కార్యాలయానికి ఫిర్యాదు అందలేదు. దీంతో మూడు గంటలపాటు బాధిత మహిళలకు 108 వాహనంలోనే సిబ్బంది చికిత్సలు అందించారు. రైల్వే ఉన్నతాధికారులు కల్పించుకొని ఆదేశాలివ్వడంతో మధ్యాహ్నం 2.30 గంటలకు వీరికి ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. 


 

మరిన్ని వార్తలు