శోభతో చేతన్‌ 8 నెలలుగా సహజీవనం...

6 Nov, 2023 08:33 IST|Sakshi

కర్ణాటక: ముగళూరు దక్షిణ పినాకిని నదిలో గతనెల 26న హత్యకు గురైన చేతన్‌(26) అనే యువకుడి కేసులో బ్యూటీపార్లర్‌ మహిళతో పాటు ముగ్గురిని సర్జాపుర పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెంగళూరు నగరానికి చెందిన శోభ, కోలారు జిల్లా మాలూరు తాలూకా చిక్కతిరుపతికి చెందిన సతీశ్‌, స్నేహితుడు శశి పట్టుబడారు. పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కృష్ణరాజపురంలో బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తున్న శోభతో చేతన్‌ 8 నెలలుగా సహజీవనం చేస్తున్నాడు. అతను కృష్ణరాజపురంలోని అయ్యప్పనగర రియల్‌ఎస్టేట్‌ కార్యాలయంలో పనిచేస్తున్నారు. అయితే శోభకు చిక్కతిరుపతికి చెందిన సతీశ్‌ అనే వ్యక్తితో పరిచయమైంది. సతీశ్‌ భూ విక్రయ వ్యవహారంలో రూ.40 లక్షలకు పైగా డబ్బు సంపాదించగా శోభ కోరిక మేరకు రూ.25 లక్షలు ఖర్చుచేసి బ్యూటీపార్లర్‌ పెట్టించాడు.

సతీశ్‌ తన స్నేహితులైన మధు, శశితో కలిసి చేతన్‌ను చిక్కతిరుపతి సమీపంలోని బార్‌కు పిలిపించి మద్యం తాపించి హత్యచేసి దక్షిణ పినాకినిలో మృతదేహం పడేసి ఉడాయించారు. ఈ ఘటనపై సర్జాపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని బార్‌ వద్ద అమర్చిన సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి హత్యకేసులో నిందితులను ఆదివారం అరెస్ట్‌చేశారు.

మరిన్ని వార్తలు