ఏకంగా రోడ్డునే దోచేశారు: అవాక్కవుతున్న నెటిజన్లు, వైరల్‌ వీడియో 

6 Nov, 2023 19:06 IST|Sakshi

బిహార్‌లో మరో వింత చోరీ వైరల్‌గా మారింది. ఏకంగా నిర్మాణంలో ఉన్న రోడ్డునే లూటీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిహార్ రాష్ట్రంలోని జెహనాబాద్‌లో ఈ షాకింగ్ దొంగతనం చోటు చేసుకుంది. ఈ వైరల్‌  వీడియో చూసిన  నెటిజన్లు  ఆగ్రహంతో స్పందిస్తూ కామెంట్‌ల వర్షం కురిపించారు. 

జెహనాబాద్‌ గ్రామానికి ముఖ్యమంత్రి గ్రామ సడక్ యోజన కింద రహదారిని నిర్మిస్తున్నారు. కాంట్రాక్టర్ కార్మికులతో కాంక్రీట్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. కాంట్రాక్టర్లు పాక్షికంగా పూర్తి చేసినా సిమెంట్‌ పనులను మాత్రం ప్రారంభించలేదు.  దీంతో అదును చూసి గ్రామస్తులంతా కలిసి నిర్మాణంలో ఉన్న రోడ్డును లూటీ చేశారు. కొత్తగా వేసిన కాంక్రీటు రోడ్డుకు సంబంధించిన కాంక్రీటు, ఇసుక, చిప్స్ మొత్తాన్ని క్షణాల్లోనే ఖాళీ చేసేశారు. ఒకరికొకరు పోటీ పడి మరీ తన పని కానిచ్చారు.

పాక్షికంగా నిర్మించిన రహదారి నిర్మాణ సామగ్రిని దొంగిలించినట్లు గుర్తించినట్లు అధికారులు ధృవకరించారు. జిల్లా కేంద్రానికి మంచి కనెక్టివిటీని అందించాలనే లక్ష్యంతో స్థానిక RJD ఎమ్మెల్యే సతీష్ కుమార్ రెండు నెలల క్రితం రహదారికి శంకుస్థాపన చేశారు. అయితే సిమెంట్‌ పనులు పూర్తి కాకుండానే గ్రామస్తులు చోరీ చేశారని సతీష్‌ ఆరోపించారు.  దీనిపై మఖ్దుంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసామన్నారు. 

ఇది ఇలా ఉంటే అయితే రోడ్డు వేయకముందే అడ్డగోలుగా దోచుకున్నారనీ ఈ రహదారిని  ఇంకా మూడు కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉందని వారు చెప్పారు. వాస్తవానికి  ఇది  స్థానిక పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం, వైఫల్యమేనని గ్రామానికి చెందిన కొంతమంది  విమర్శించారు.

అయితే బిహార్‌లో ఇలాంటి వింత వింత చోరీలు ఇదే మొదటిసారి కాదు.  గతంలో రైల్వే ట్రాక్స్‌ దొంగిలించారు. మరోసారి  రైల్వే  ఇంజిన్  మాయమైంది. ఆ తరువాత ఏకంగా వంతెననే ఎత్తుకుపోయారు. ఇపుడు మరో దొంగతనంతో తమ రికార్డును తామే అధిగమించారు.  ప్రస్తుతం కాంక్రీటు రోడ్డు చోరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటువంటి దొంగలపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వారిని 5 సంవత్సరాల పాటు అన్ని ప్రభుత్వ సౌకర్యాలకు దూరంగా ఉంచాలంటూ నెటిజన్లు కమెంట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు