మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు

16 Mar, 2016 00:33 IST|Sakshi

 పెంటపాడు : గతేడాది డిసెంబర్‌లో ప్రత్తిపాడు రైల్వేట్రాక్‌పై మృతి చెందిన మహిళది హత్య అని పెంటపాడు పోలీసులు తేల్చారు. నిందితులను మంగళవారం అరెస్టు చేసి, తాడేపల్లిగూడెం కోర్టుకు తరలించారు. ఈ వివరాలను సీఐ మధుబాబు  పెంటపాడు పోలీసుస్టేషన్ వద్ద విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత డిసెంబర్‌లో ప్రత్తిపాడు రైల్వేట్రాక్‌పై కామరాపు పూర్ణచంద్రిక (23) మృతదేహం లభ్యమైంది. అప్పట్లో తాడేపల్లిగూడెం రైల్వేపోలీసులు ఆమెది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
 
  ఆమె పుట్టిల్లు పాలకోడేరు మండలం గొల్లలకోడేరు కాగా..  అత్తవారిల్లు పెదవేగి మండలం కొప్పాక. కొప్పాకకు చెందిన దుర్గారావుతో ఆమెకు  2008లో పెళ్లైంది. పూర్ణచంద్రిక మృతి సమయంలో ఆమె తండ్రి పతివాడ పెదపైడియ్య తన కుమార్తె ప్రమాదవశాత్తూ చనిపోలేదని, భర్తే హత్యచేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అతనికి వివాహేతర సంబంధం ఉందని తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని గూడెం రైల్వేపోలీసులు జిల్లా రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
  అక్కడినుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సమాచారంతో ఎస్పీ ఆదేశాల మేరకు  హత్యకేసుగా నమోదు చేసిన పెంటపాడు పోలీసులు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం రూరల్ సీఐ మధుభాబు, పెంటపాడు ఎస్సై కె.గుర్రయ్య నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. పూర్ణచంద్రిక హత్యకు భర్త దుర్గారావు, అతని బంధువులే కారణమని తేల్చారు.  పూర్ణచంద్రికకు పురుగుల మందు తాగించి ఆపై చీరతో ఉరివేసి హత్య చేశారని, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రత్తిపాడు బ్రిడ్జి వద్ద కింద ఉన్న పట్టాలపై మృతదేహాన్ని పడవేశారని గుర్తించారు.
 
 దీంతో మృతురాలి భర్త దుర్గారావుతోపాటు పూళ్లగ్రామానికి చెందిన దుర్గారావు పిన్ని కుమారుడు  అల్లురవి, ఆటో డ్రైవర్ రౌతు సింహాద్రిని అరెస్టుచేసి మంగళవారం కోర్టుకు పంపినట్లు సీఐ మధుబాబు తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్న దుర్గారావు  చెల్లెలు రాజేశ్వరి పరారీలో ఉందని ఆమెను కూడా త్వరలో అరెస్ట్‌చేస్తామని సీఐ వెల్లడించారు. ఈ హత్యకేసు మిస్టరీని ఛేదించేందుకు సహకరించిన పెంటపాడు ఎస్సై కె.గుర్రయ్య, హెచ్‌సీలు సాంబశివరావు, ఎస్.ఎన్.భూషణం, కానిస్టేబుల్ గంగాధర్‌ను సీఐ ప్రత్యేకంగా అభినందించారు.
 

మరిన్ని వార్తలు