వావ్.. పెయ్యల ఫ్యాషన్ షో

11 Jan, 2015 02:46 IST|Sakshi
వావ్.. పెయ్యల ఫ్యాషన్ షో

నెల్లూరు(అగ్రికల్చర్): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి పశువుల అందాల ప్రదర్శనలో భాగంగా శనివారం నిర్వహించిన పెయ్యల ప్రదర్శన అబ్బురపరిచింది. స్థానిక కనుపర్తిపాడులోని పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకుంది. తెలంగాణ, ఆంధ్రాలోని పలు ప్రాంతాల నుంచి పలువురు తమ పశువులతో ఉత్సాహంగా తరలివచ్చారు. నెల్లూరులో మొదటిసారిగా నిర్వహించిన ప్రదర్శన కావడంతో తిలకించేందుకు జిల్లా వా సులు ప్రత్యేక ఆసక్తి చూపారు.

నెల్లూరు సిటీ, రూరల్, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యూదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య ప్రదర్శనను తిలకించి నిర్వాహకులను ప్రశంసించారు. పెయ్యల విభాగంలో నెల్లూరుకు నాలుగు బహుమతులు రావడం స్థానికులను ఉత్తేజపరచింది. ఆవుల విభాగంలోనూ మూడు స్థానాలను నెల్లూరు కైవసం చేసుకుంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన పశువులకు వరుసగా రెడ్, గ్రీన్, ఎల్లో రిబ్బన్లను అలంకరించారు. ఆదివారం గిత్తల పోటీలను నిర్వహించనున్నారు.

సాయంత్రం జరిగే ముగింపు సభలో నగదు, జ్ఞాపికలు అందజేయనున్నారు. ప్రదర్శన ఏర్పాట్లను పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత వెంకురెడ్డి, మైనేజింగ్ డెరైక్టర్ సతీష్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మేనేజర్ సుబ్బారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి పర్యవేక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ఒంగోలు జాతి లక్షణాలే ప్రామాణికం
అందాల ప్రదర్శనలో ఒంగోలుజాతి లక్షణాలనే ప్రామాణికంగా తీసుకొని విజేతలుగా నిర్ణయిస్తున్నామని న్యాయనిర్ణేతలు,  విశ్రాంత పశువైద్యులు బి.సీతారెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ గురవారెడ్డి తెలిపారు. తలకట్టు, కళ్లు, కొమ్ములు, మెడ పొడవు, చెండు, తోక పొడవు, కుచ్చు, కాళ్లు, గిట్టలు, బొడ్డు, చర్మ సౌందర్యం, వృషణాలు తది తర అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. న్యాయనిర్ణేతలుగా పశువైద్యులు డాక్టర్ వెంకటస్వామిరెడ్డి, ప్రభాకర్‌గుప్తా, కె.కోటేశ్వరరావు కూడా వ్యవ హరిస్తున్నారు.  
 
ఒంగోలు జాతి సంతతి అభివృద్ధే లక్ష్యం
ఒంగోలు జాతి సంతతి అభివృద్దే లక్ష్యంగా ఐదు గిత్తలను పెంచుతున్నాము. విత్తన గిత్తలుగా వీటిని వినియోగిస్తూ ఒంగోలు జాతి పశు సంపద అభివృద్ధికి కృషి చేస్తున్నాను. గో సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శనకు విత్తన గిత్తలను తీసుకొచ్చాను.
 - నల్లబోలు కోటయ్య, తుర్లుపాడు, ప్రకాశం జిల్లా
 
విజేతలు:
పెయ్యల విభాగంలో..
పాలపళ్ల విభాగంలో ఆరు పెయ్యలు అందాలను ప్రదర్శించాయి. రంగారెడ్డి జిల్లా గో సేవాసంఘంకు చెందిన భారతినారాయణరెడ్డి పెయ్య మొదటి స్థానం కైవసం చేసుకుంది. రెండో స్థానంలో ఇందుకూరుపేట మండలం జేజేపేటకు చెందిన కదురు సాగర్‌రెడ్డి పెయ్య, మూడో స్థానంలో ఖమ్మం జిల్లా పాతలింగాల నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఆర్‌ఎంరెడ్డికి చెందిన పెయ్య నిలిచారుు.
 
ఒక జత పళ్ల విభాగంలో 5 పెయ్యలు అందాలను ప్రదర్శించాయి. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు చెందిన చి లంకూరి పూర్ణలక్ష్మి, ప్రకాశం జిల్లా లింగంగుంటకు చెందిన షేక్ మహ్మద్ అలీ, నెల్లూరు పూండ్ల వెంకురెడ్డి గోశాలకు చెందిన పెయ్యలు మొదటి మూడు స్థానాల్లో నిలిచారుు.
 
రెండు జతలు, మూడు జతల పళ్ల విభాగంలో ఆరు పెయ్యలు అందాలను ప్రదర్శించాయి. కోవూరు మండలం లేగుంటపాడుకు చెందిన తుంగా సుజిత్‌రెడ్డి, నెల్లూరు పూండ్ల వెంకురెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన నల్లబోలు కోటయ్య పెయ్యలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారుు.
 
ఆవుల విభాగంలో 29 పశువులు అందాలను ప్రదర్శించాయి. ఈ విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు జిల్లాకే దక్కారుు. పూండ్ల వెంకురెడ్డి, సర్వేపల్లి వినోద్‌కుమార్, పెద్దచెరుకూరు మాధవగోశాలకు చెందిన ఆవులు మొదటి మూడు స్థానాల్లో నిలిచారుు.  
 
రెండు గిత్తలను పెంచుతాను
ఒంగోలు జాతి ఆవులు, గిత్తలు ఇంటి ఆవరణలో ఉండటం ఎంతో శ్రేయస్కరం. ఆవులను పెంచే ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో కళకళలాడుతుంది. గో సంపద అంతరించిపోతున్న తరుణంలో పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ జాతి పశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

గతంలో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఆవులు ఉండేవి. ఇప్పుడు కూడా ఆవులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రదర్శన చూసిన తర్వాత నేను కూడా గిత్తలను పెంచుకోవాలనుకుంటున్నాను. తప్పనిసరిగా రెండు గిత్తలను పెంచుతాను.
 - అనిల్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే
 
సంతోషంగా ఉంది
రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి పశువుల ప్రదర్శన అలరిస్తోంది. నిర్వాహకులైన పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్‌ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒంగోలు జాతి పశువుల ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రదర్శనను నిర్వహించడం సంతోషంగా ఉంది. జిల్లా ప్రజలందరూ ఈ ప్రదర్శనను తిలకించాలి. వివిధ జిల్లాల నుంచి ఒంగోలు జాతి పశువులు తీసుకొచ్చిన యజమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
 - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే

పశు సంపదను కాపాడుకోవాలి
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి పశుసంపదను కాపాడుకోవాలి. మన పూర్వీకులు ప్రతి ఇంట్లో ఒంగోలు జాతి ఆవులు, గిత్తలను పెంచుకునేవారు. వ్యవసాయానికి, పాడి పరిశ్రమ అభివృద్ధికి అవి ఎంతగానో ఉపయోగపడేవి. ప్రస్తుతం యంత్రాలు వాడుకలోకి రావడంతో పశుసంపద అంతరించిపోతుంది. ప్రతి కుటుంబం కనీసం ఒక ఆవునైనా పెంచుకుంటే బావుంటుంది.  
 - కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు