జగన్‌దీక్షకు సంఘీభావం

28 Aug, 2013 05:16 IST|Sakshi

సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడంతో, ఆయనకు మద్దతుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ఆ పార్టీ నాయకులు మంగళవారం రహదారులు దిగ్బంధించారు. మరికొంతమంది నాయకులు దీక్షలకు దిగుతున్నారు. చిత్తూరులో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ నేతృత్వంలో బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో పోలీ సులు మనోహర్‌ను అరెస్టు చేశారు. ఆయనను చిత్తూరు 2 టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లి, రెండు గంటల తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం నేతృత్వంలో పిచ్చాటూరులో చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు.
 
 ఆదిమూలంతో పాటు, పార్టీ నాయకుడు హరిశ్చంద్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలమనేరులో పట్టణ కన్వీనర్ హేమంతకుమార్ నేతృత్వంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గంగవరంలో సీవీ కుమార్ నాయకత్వంలో రహదారులపై బైఠాయించారు. మదనపల్లెలో పార్టీ మైనారిటీ నాయకుడు బాబ్‌జాన్ నాయకత్వంలో బెంగళూరు రోడ్డును దిగ్బంధం చేశారు. మదనపల్లెలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి షమీమ్ అస్లాం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష మూడవ రోజుకు చేరుకుంది. ఆమె ఆరోగ్యంపట్ల నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తంచేయడంతో  డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చిత్తూరులో మూడో రోజు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఆ పార్టీ నాయకులకు విద్యార్థులు,  ఫ్యాక్టరీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. శ్రీకాళహస్తిలో బియ్యపు కృష్ణారెడ్డి మండపంలో పార్టీ నాయకులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. వారికి వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు వరప్రసాదరావు సంఘీభావం తెలిపారు. గంగాధరనెల్లూరు పరిధిలోని ఎస్‌ఆర్‌పురం, పెనుమూరు, కార్వేటినగరం మండలాల్లో జగన్‌కు సంఘీభావంగా రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.
 
 గంగాధర నెల్లూరులో జరిగిన దీక్షకు జిల్లా కన్వీనర్ నారాయణస్వామి సంఘీభావం ప్రకటించారు. పుంగనూరులోను రిలే నిరాహార దీక్షలు మూడవ రోజుకు చేరుకోగా, ఆ పార్టీ సమన్వయకర్త రెడ్డెప్ప, మార్కెట్ కమిటీ మాజీ ైచె ర్మన్ నారాయణరెడ్డి మద్దతు తెలిపారు. కుప్పం నియోజకవర్గ కన్వీనర్ సుబ్రమణ్యంరెడ్డి నేతృత్వంలో రిలే నిరాహారదీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. రామకుప్పంలో ముగ్గురు యువకులు అరగుండు గీసుకుని, జగన్ దీక్షకు సంఘీభావం తెలిపారు. తిరుపతిలో వైఎస్సార్ సీపీ క్రైస్తవ నాయకులు, నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి నాయకత్వంలో రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు.
 
 తిరుపతిలో వైఎస్సార్ సీపీ మహిళా కన్వీనర్ కుసుమ నేతృత్వంలో గంగమ్మకు పొంగళ్లు పెట్టారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌కు ఆరోగ్యం సహకరించాలని వేడుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలంలో  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గణపతి పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు