కలెక్టర్‌ ముందే ఆత్మహత్య చేసుకుంటా

20 Jan, 2018 06:37 IST|Sakshi

కడుపు మండిన ఓ రైతు వీడియో మెసేజ్‌

పాస్‌ పుస్తకాల కోసం నానా తిప్పలు పెడుతున్నారు

సాక్షి, అమరావతి బ్యూరో/ గుంటూరు వెస్ట్‌: కడుపు మండి ఓ రైతు పెట్టిన వీడియో అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏం చేయాలో తోచక ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఆ వీడియో సారాంశం అతని మాటల్లోనే.. ‘‘నాపేరు రాజా. నేను గుంటూరు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతును. నాకు వారసత్వంగా ఎకరా భూమి సంక్రమించింది. గతేడాది మరో 22 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేస్తే తెగులు వచ్చి మొత్తం పోయింది. అయితే పంట కోసం నేను చేసిన అప్పు రూ. 8 లక్షలు ఇప్పటికి వడ్డీతో సహా రూ. 10 లక్షలయింది. నా ఎకరా భూమి అమ్మి అప్పు తీర్చేద్దామని గత ఏడాది మే 13న స్థానిక సర్వేయర్‌కు పాస్‌ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటికి పదిసార్లు నన్ను కార్యాలయం చుట్టూ తిప్పుకుని నానా ఇబ్బందులకు గురిచేశారు. అయినా పాస్‌ పుస్తకాలు ఇవ్వలేదు." అంటూ వాపోయాడు.

అయితే అధికారుల తీరుతో ఇక విసిగిపోయిన రైతు ఈ నెల 22న గుంటూరులో కలెక్టర్‌ గారి ముందు ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించాడు. ఇంకా రైతు మాట్లాడుతూ "నేను పక్కా తెలుగుదేశం పార్టీ అభిమానిని. ఏం ప్రభుత్వం ఇది. రైతే రాజన్నారు. ఇదేనా చంద్రబాబు పాలన? రైతులు చచ్చిపోతున్నా మీకు పట్టదా? నేను చచ్చిపోయిన తర్వాత నాకు చంద్రన్న బీమా కింద రూ.5 లక్షలిస్తారని తెలిసింది. దయచేసి ఆ మొత్తాన్ని నా కుటుంబానికి ఇవ్వండి. నాకున్న ఎకరా పొలంలో సగం అమ్మితే రూ. 5 లక్షలు వస్తుంది. మొత్తం రూ.10 లక్షలతో అప్పులు తీర్చేయవచ్చు. ఈనెల 22లోపు ఎవరికైనా కిడ్నీ కావాలంటే ఇవ్వడానికి సిద్ధం. వ్యవసాయం తప్ప ఏమీ తెలీని నాకు ఎలా అప్పులు తీర్చుకోవాలో తెలీక ఈ సాహసం చేస్తున్నాను. నాకు రెండున్నరేళ్ళ పాప, 10 నెలల బాబు ఉన్నారు. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలి. రైతులు ఎలా జీవిస్తున్నారో. పెద్దగా చదువులేని వారు కార్యాలయాల చుట్టూ ఎలా తిరుగుతారు. మీ ప్రభుత్వంలో అధికారుల పనితీరు ఎలా ఉందో చూడండి ముఖ్యమంత్రి గారు. నాలాగా మరెవ్వరూ బాధపడకూడదని కోరుతున్నాను’’ అని తెలిపాడు. ఈ వీడియో ప్రభుత్వ అధికారుల దృష్టికి చేరింది. దీంతో గురజాల ఆర్డీవో మురళి దీనిపై విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు