అమ్మను రైలెక్కించి వచ్చేస్తున్నా..

25 Feb, 2018 13:17 IST|Sakshi

పెళ్లకూరు: ఆస్పత్రికి వెళ్లేందుకు అమ్మను రైలెక్కించి త్వరగా వచ్చేస్తున్నానంటూ భార్యకు చెప్పిన పది నిమిషాలకే ఓ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. అతి వేగంగా వచ్చిన లారీ ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. మండలంలోని చింతపూడికి చెందిన మల్లారపు నాగేంద్రబాబు (23) శనివారం తన తల్లి కృష్ణమ్మను నెల్లూరులోని ఆస్పత్రికి పంపించేందుకు బైక్‌లో నాయుడుపేటకు తీసుకువచ్చి రైలెక్కించాడు. అంతలో భార్యకు ఫోన్‌ చేయడంతో అమ్మను జాగ్రత్తగా రైలెక్కించాను.. తిరిగి వచ్చేస్తున్నానంటూ చెప్పాడు.

 నాయుడుపేట నుంచి చింతపూడికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఎగువచావలి వద్ద గేదెలు అడ్డు రావడంతో అదుపుతప్పి రోడ్డుమీద పడ్డాడు. అదే సమయంలో తమిళనాడు రాష్ట్రం ఆరణి ప్రాంతం నుంచి తవుడు లోడుతో హైదరాబాదుకు వెళుతున్న లారీ అతివేగంగా నాగేంద్ర నడుము మీద ఎక్కింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేంద్రబాబును నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న నాయుడుపేట సీఐ మల్లికార్జున్‌రావు, ఏఎస్సై కోటీశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరి శీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగేంద్రబాబు మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీని స్వా« దీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

పెళ్లైన తొమ్మిది నెలలకే..
నాగేంద్రబాబుకు తొమ్మిది నెలల కిందట నాయుడుపేట మండలం పండ్లూరుకు చెందిన ప్రమీలతో వివాహం అయింది. నాగేంద్రబాబు తండ్రి అంతకు ముందే చనిపోయాడు. నాగేంద్రబాబు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెళ్‌లైన తొమ్మిది నెలలకే భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇక మాకు దిక్కెవరంటూ భార్య ప్రమీల, తల్లి కృష్ణమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు పోలయ్య, చెంగయ్య, పరశురాం, నాగభూషణం  ఉన్నారు.

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
మరొకరికి గాయాలు

వరికుంటపాడు: లారీ ఢీకొని ఓ యు వకుడు దుర్మరణం పాలవగా, మ రొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈఘటన ప్రకాశం జిల్లా పామూరు విరాట్‌నగర్‌ సమీపంలో శనివారం జరిగింది. తొడుగుపల్లికి చెందిన ఎన్‌.నవీన్‌ (21), టి. సుబ్బరాయు డు బైక్‌పై పామూరు మీదుగా వరికుంటపాడు వెళ్లేందుకు బ యల్దేరారు. పామూరు పట్టణంలో నుంచి వరికుంటపాడు వెళ్లేందుకు బైపాస్‌రోడ్డు ఎక్కుతుండగా దుత్తలూరు వైపు నుంచి కలిగిరి వైపు వెళుతున్న లారీ బైక్‌ను ఢీకొంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం పామూరులోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోనం నెల్లూరు తరలించగా సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవీన్‌ మృతి చెందాడు.

మరిన్ని వార్తలు