శభాష్‌.. అవినాష్‌

24 May, 2019 16:30 IST|Sakshi

వైఎస్‌ అవినాష్‌రెడ్డికు 3.55 లక్షల భారీ మెజార్టీ

అన్ని నియోజకవర్గాల్లోనూ... రౌండ్‌ రౌండ్‌కు పెరిగిన మెజార్టీ

పులివెందులలో 84,631 ఆధిక్యత

2014తో పోలిస్తే రెండింతలు అధికంగా ఓట్లు

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి 2.64 లక్షల మెజార్టీ

సాక్షి, కడప : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ, యువ నాయకుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డికి 2019 ఎన్నికల్లో జిల్లా ప్రజలు భారీ మెజార్టీని అందించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి 2011 ఉప ఎన్నికల్లో అందించిన మెజార్టీ తర్వాత ఇదే రెండవది కావడం విశేషం. 2014 ఎన్నికల్లో  అవినాష్‌ 1.91 లక్షల మెజార్టీ సాధించారు. ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక వి«ధానాలపై ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూ....మరోప్రక్క ప్రత్యేక హోదా కోసం పదవిని సైతం తృణ ప్రాయంగా వదిలేసిన వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా సమస్యలపై అనునిత్యం పోరాడుతూ వచ్చారు.  ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రజా నేతను గుర్తించిన ప్రజలు తమకున్న మమకారాన్ని ఓట్ల రూపంలో చూపించారు. ప్రతి రౌండులోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థికి మెజార్టీ పెరుగుతూనే ఉంది.

తాజా ఎన్నికల్లో సుమారు 3.55 లక్షల మెజార్టీని జిల్లా ఓటర్లు అందించారు. ఒక్క పులివెందులలోనే 84,631 ఓట్ల మెజార్టీని పొందారు. ఆయనపై టీడీపీ పక్షాన నిలిచిన ఆదినారాయణరెడ్డికి సొంత నియోజకవర్గమైన జమ్మలమడుగులో కూడా మెజార్టీ రాలేదు. బద్వేలులో 1,55,152 ఓట్లు పోల్‌ కాగా వైఎస్‌ అవినాష్‌రెడ్డికి 1,02,845 ఓట్లు వచ్చాయి. కడపలో ఆయన 1,03,202 ఓట్లు తెచ్చుకుని ప్రత్యర్థిపై 50,690 ఓట్ల మెజార్టీని సాధించారు. ప్రొద్దుటూరులో1,08,712 ఓట్లు రాగా 43,471 ఓట్ల మెజార్టీని సా«ధించారు.  

కమలాపురం సెగ్మెంట్‌లో అవినాష్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిపై 37,268 ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు. జమ్మలమడుగులో టీడీపీ అభ్యర్థిపై 51,641 మెజార్టీని సాధించి రికార్డు సృష్టించారు. మైదుకూరులోనూ 28,800 ఓట్లకు పైగా మెజార్టీతో భారీ విజయాన్ని నమోదు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వైఎస్‌ అవినాష్‌రెడ్డికి వచ్చిన ఓట్లు కలుపుకుంటే భారీ మెజార్టీ  రికార్డు నమోదైంది ఎన్నికలు జరిగిన ప్రతిసారి వైఎస్‌ అవినాష్‌రెడ్డి మెజార్టీలో రికార్డులు సృష్టిస్తూ వస్తున్నారు.

పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి భారీ మెజార్టీ
జిల్లాలోని రాజంపేట పార్లమెంటు స్థానానికి సంబంధించి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అఖండ మెజార్టీతో ఓటర్లు గెలిపించారు. 2014లో 1.77 లక్షల పైచిలుకు ఓట్లతో గెలిచిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఈసారి 2.64 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీని అందించారు. జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలతోపాటు చిత్తూరుజిల్లాలోని పలు నియోజకవర్గాలు రాజంపేట పరిధిలోకి వస్తాయి. ప్రజా సమస్యలతోపాటు ప్రత్యేక హోదా విషయంలో పదవిని కూడా త్యాగం చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పట్ల ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీడీపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటిలలో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి భారీ మెజార్టీ లభించింది. ఏది ఏమైనా జిల్లాలోని ఇరువురు ఎంపీలకు భారీ మెజార్టీ అందించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. 
 

మరిన్ని వార్తలు