ఒక్క హామీనైనా నెరవేర్చారా?

24 Nov, 2017 06:10 IST|Sakshi

ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు

ఏడు హాస్టళ్లను ఎలా ఎత్తివేస్తారంటూ ఆగ్రహం

జననేత జగన్‌  ప్రసంగానికి జేజేలు   

నారాయణ రెడ్డిని గుర్తు చేసుకున్న ప్రజలు  

జిల్లాలో ముగిసిన 9వ రోజు పాదయాత్ర

గురువారం 13.4 కిలోమీటర్లు నడిచిన వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, కర్నూలు:   ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని   ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని  ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లను పూర్తి చేస్తే.. ఈ ప్రభుత్వం  పిల్లకాలువలు తవ్వి నీళ్లు ఇవ్వలేకపోయిందన్నారు. గురువారం.. ప్రజాసంకల్ప యాత్ర పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్ది మండంలో సాగింది. పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి అడుగడుగునా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు..దివంగత నేత చెరుకులపాడు నారాయణ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వెల్దుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ప్రసంగించారు. పత్తికొండనియోజకవర్గానికి ప్రభుత్వం చేసిందేమీ లేదని... ఉన్న ఏడు హాస్టళ్లను ఎలా ఎత్తివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీ నీవా పిల్లకాల్వలను ఏర్పాటు చేసి నీరు కూడా ఇవ్వలేదన్నారు.  నారాయణ రెడ్డిని పట్టపగలు దారుణంగా చంపేశారని జగన్‌ తన ప్రసంగంలో మండిపడ్డారు. నారాయణ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని మరోసారి ప్రకటించారు. ఈ సమయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. 

పాదయాత్ర సాగిందిలా..
జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర.. తొమ్మిదో రోజు గురువారం ఉదయం 8.30 గంటలకు నర్సాపురం క్రాస్‌ నుంచి మొదలై రామళ్లకోట, బోయినపల్లి క్రాస్, రత్నపల్లి క్రాస్‌ మీదుగా వెల్దుర్తిలో సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా మొత్తం 13.4 కిలోమీటర్ల మేర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నడిచారు. పత్తికొండ ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి.. నియోజకవర్గానికి ఏమీ చేయలేదంటూ అడుగడుగునా ప్రజలు జననేతకు విన్నవించారు. పల్లెలకు రోడ్లు కూడా వేయించలేకపోయారని ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.    

నారాయణ రెడ్డిని గుర్తుచేసుకుంటూ...
దివంగత నేత నారాయణ రెడ్డిని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అడుగడుగునా గుర్తు చేసుకున్నారు. నారాయణ రెడ్డి  ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇంకా తమ గుండెల్లో ఆయన బతికే ఉన్నారని అడుగడుగునా ప్రజలు స్పష్టం చేశారు. కంగాటి  శ్రీదేవికి అండగా ఉంటామని చెప్పారు. దీంతో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

పాల్గొన్న నేతలు..
వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కంగాటి శ్రీదేవి, ఎమ్మెల్యేలు గౌరు చరిత, ఐజయ్య, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, కర్నూలు, ఎమ్మిగనూరు, కోడుమూరు సమన్వయ కర్తలు హఫీజ్‌ఖాన్, జగన్‌మోహన్‌ రెడ్డి, మురళీకృష్ణ, పార్టీ నేతలు ప్రదీప్‌రెడ్డి, తెర్నేకల్లు సురేందర్‌ రెడ్డి, విజయకుమారి, జెడ్పీటీసీ సభ్యులు యుగంధర్‌ రెడ్డి, శ్రీరాములు, రవిరెడ్డి,  జగదీశ్వర్‌ రెడ్డి, ఫీరోజ్‌ఖాన్, పర్ల శ్రీధర్‌ రెడ్డి, మద్దయ్య, అనిల్‌కుమార్, భాస్కర్‌ రెడ్డి, కరుణాకర్‌ రెడ్డి, పుల్లారెడ్డి, తౌఫిక్‌ బాష తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు