ఒంట్లో నలత..అయినా ఆగని నడక

20 Aug, 2018 06:31 IST|Sakshi

ఏకబికిన 9 కిలోమీటర్ల పాదయాత్ర

జోరువర్షంలోనూ ఆగని అడుగులు

సాక్షిప్రతినిధి, విశాఖపట్నం: ప్రజల కోసం.. వారి కష్టాలు తెలుసుకునేందుకు.. నేనున్నానని ధైర్యం ఇచ్చేందుకు.. వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర  అనంతవాహినిలా సాగిపోతోంది. వానొచ్చినా, వరదొచ్చినా.. చివరికి ఏ కష్టమొచ్చినా ఆగడం లేదు. వైఎస్‌ జగన్‌ ఆదివారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గం పెదబొడ్డేపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. గత నాలుగు రోజులుగా జోరు వర్షాల్లో తడిసి ముద్దయినప్పటికీ పాదయాత్ర కొనసాగిస్తున్న ఆయన శనివారంరాత్రి నుంచి తీవ్ర జలుబు, తలనొప్పితో బాధపడుతున్నారు. అయితే ఆదివారం ఉదయమే ఆయన బస వద్దకు వేలాదిగా జనం రావడంతో వర్షంలోనే పాదయాత్రకు బయల్దేరారు.

మధ్యలో వర్షం జోరు పెరిగినా ఎక్కడా ఆగకుండా ఏకబికిన 9 కిలోమీటర్లు నడిచారు. ఎక్కడా ఆయన మోముపై చిరునవ్వు చెరగలేదు. కష్టాలు.. వేదనలు చెప్పుకునేందుకు వచ్చిన వారికి ఎంతో ఓపిగ్గా సమయం వెచ్చించారు. సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపిన యువతతో అదే ఉత్సాçహంతో ఫోటోలు దిగారు. పాదయాత్రలోనే పార్టీ నాయకులతో మాట కలిపారు. ఒంట్లో నలతగా ఉన్నా ఎక్కడా విరామం లేకుండానే తొమ్మిది కిలోమీటర్లు నడిచిన వైఎస్‌ జగన్‌ మనో నిబ్బరం చూసి పార్టీ శ్రేణులే అచ్చెరవొందాయి.

మరిన్ని వార్తలు