విభజన అంశాలపై సమస్యలను పరిష్కరించండి

14 Jun, 2019 04:21 IST|Sakshi

గవర్నర్‌ నరసింహన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ

విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి

సాక్షి, అమరావతి: రాష్ట్ర పునర్విభజన చట్టంలోని తొమ్మిది, పదవ షెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన సమస్యలను విచక్షణాధికారంతో పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌కు లేఖ రాశారు. లాభాలు ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన నిధులను ఏ ప్రాతిపదికన పంపిణీ చేయాలనే దానిపై విభజన చట్టంలో పేర్కొనలేదని, ఈ నేపథ్యంలో గవర్నర్‌గా విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకుని, త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. తొమ్మిదవ షెడ్యూల్లోని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల పంపిణీకి సంబంధించి షీలా బేడీ కమిటీ కొన్ని సిఫార్సులు చేసినప్పటికీ అవి అమల్లోకి రాలేదన్నారు.

ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల గవర్నర్‌గా విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. కొన్ని ఇన్‌స్టిట్యూషన్లకు సంబంధించి అప్పుల పంపిణీ ఏ ప్రాతిపదికన చేయాలో విభజన చట్టంలో స్పష్టత లేదన్నారు. ఈ విషయంలో కూడా గవర్నర్‌గా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. తెలంగాణకు భవనాల అప్పగింత విషయంలో జరిగిన తరహాలోనే విభజనకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన బకాయిలు రాష్ట్రానికి రావాల్సి ఉందని, ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమస్యలున్నాయని.. వీటన్నింటినీ పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. గత ఐదేళ్లుగా చంద్రబాబు సర్కారు విభజన అంశాల పరిష్కారంపై పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జగన్‌ దృష్టి సారించడం విశేషం. 

>
మరిన్ని వార్తలు