శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలోని అంశం

14 Jun, 2019 04:24 IST|Sakshi

గవర్నర్‌కు సంబంధం లేదు: బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

కోల్‌కతా: శాంతి భద్రతలు రాష్ట్రం పరిధిలోని అంశమని, దానితో గవర్నర్‌కు సంబంధం లేదని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చర్చించేందుకంటూ గవర్నర్‌ కేసరీనాథ్‌ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంపై మమత గురువారం కోల్‌కతాలో  మాట్లాడారు. ‘గవర్నర్‌ ప్రయత్నం వెనుక బీజేపీ ప్రోద్బలం ఉందని మమత ఆరోపించారు. శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినందునే ఆ సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశానికి టీఎంసీ ప్రధాన కార్యదర్శి, మంత్రి పార్థ చటర్జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్, కాంగ్రెస్, సీపీఎం రాష్ట్ర నేతలు సోమేన్‌ మిత్రా, సూర్య కాంత మిశ్రా హాజరయ్యారు. అయితే, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో సీఎం మమత పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయ్‌ మజుందార్‌ అన్నారు.  

జూ.డా.ల సమ్మె వెనుక బీజేపీ, సీపీఎం
రాష్ట్రంలోని ప్రభుత్వం ఆస్పత్రుల్లో జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగడం వెనుక రాజకీయ ప్రత్యర్థులైన సీపీఎం, బీజేపీల హస్తం ఉందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సీపీఎం సాయంతో వైద్యుల సమ్మెకు మతం రంగు పులిమేందుకు బీజేపీ కుట్ర పన్నిందన్నారు.

మరిన్ని వార్తలు