జోరువానలోనూ సాగిన ప్రజాసంకల్పయాత్ర

19 Aug, 2018 06:37 IST|Sakshi

కదంతొక్కిన నర్సీపట్నం వాసులు

అడుగడుగునా జనహారతులు

జననేతకు వినతుల వెల్లువ 

సాక్షి, విశాఖపట్నం: జనజాతర పోటెత్తింది. జనం ప్రభంజనంలా మారింది. జననేత వెంట కదం తొక్కింది. పూలదారులద్దింది. మంగళహారతులు పట్టింది. జోరువానను సైతం లెక్క చేయకుండా సంకల్ప సూరీడు అడుగులో అడుగువేస్తూ ఉరకలెత్తింది. ప్రజాకంటక పాలనలో తాము పడుతున్న అవస్థలను అడుగడుగునా జననేత దృష్టికి తీసుకురాగా.. త్వరలోనే మనందరి ప్రభుత్వంలో మీ అందరి కష్టాలు తీరుతాయంటూ ఆయన భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్ర 239వ రోజు శనివారం ఏజెన్సీ ముఖ ద్వారమైన నర్సీపట్నం నియోజకవర్గంలో సాగింది. 

నాతవరం, నర్సీపట్నం మండలాల్లోని గ్రామాల మీదుగా నర్సీపట్నంలోకి ప్రవేశించింది. జిల్లాలో మూడోరోజు ప్రజాసంకల్ప యాత్ర నాతవరం మండలం ములగపూడి శివారున బస చేసిన ప్రాంతం నుంచి ఉదయం 8.40 గంటలకు ప్రారంభమైంది. ములగపూడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర నాతవరం మండలం బెన్నవరం మీదుగా మొండికండి క్రాస్‌ వద్ద నర్సీపట్నం మండలంలోకి అడుగు పెట్టింది. అనంతరం కొద్దిదూరంలోనే కళ్లెంపూడి వద్ద నర్సీపట్నం మున్సిపాల్టీ పరిధిలోకి ప్రవేశించిన పాదయాత్రకు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు.

 కృష్ణాపురం, సీతయ్యపాలెం, పాతబైపురెడ్డిపాలెం మీదుగా కొత్తబైపురెడ్డిపాలెం (దుగ్గాడ క్రాస్‌) వద్ద ఉదయం 11.30 గంటలకు భోజన విరామానికి ఆగారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి పాదయాత్ర టౌన్‌లోకి ప్రవేశించింది. తుని రోడ్డులోని పెద్ద చెరువు మీదుగా పాతబస్టాండ్, అబిద్‌ సెంటర్, పాల్‌ఘాట్‌ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, శ్రీకన్యడౌన్, సబ్‌ కలెక్టర్‌ బంగ్లా మీదుగా పెదబొడ్డేపల్లి గురుకుల పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన బసకు చేరుకోవడంతో మూడోరోజు పాదయాత్ర ముగిసింది. 

అడుగడుగునా వినతుల వెల్లువ
జిల్లాలో మూడోరోజు పాదయాత్రలో జననేతను చూసేందుకు పోటీపడిన జనం గడిచిన నాలుగేళ్ల దుర్మార్గ పాలనలో తాము పడుతున్న కష్టాలను చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను జననేత ఓపిగ్గా వింటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు. తాము నివసిస్తున్న గ్రామాలను 5వ షెడ్యూల్‌లోకి చేర్చాలని మైదాన ప్రాంత గిరిజనులు మొరపెట్టుకోగా.. నర్సీపట్నంలో కలపడం వలన తాము ఉపాధి కోల్పోయామని బైపురెడ్డిపాలెం ప్రాంత ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బీసీ– డీ ధ్రవపత్రాలు ఇవ్వకుండా ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు అడ్డుకుంటున్నారని తూర్పుకాపులు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

 స్పాట్‌ బిల్లింగ్‌ మీటర్‌ రీడర్స్‌కు కమీషన్‌ పెంచాలని, తాము కష్టపడుతుంటే కాంట్రాక్టర్‌ ఒక్క మీటర్‌ రీడింగ్‌కు రూ.4.50లు తీసుకుంటూ తమకు కేవలం రూ.1.90లు ఇస్తున్నారని జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇప్పించాలని ఏపీ బేసిక్‌ హెల్త్‌ కేర్‌  మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ అసోíసియేషన్‌ ప్రతినిధులు జగన్‌కు విన్నవించుకున్నారు. డయాలసిస్‌ చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులుపడుతున్నామని కిడ్నీ వ్యాధి గ్రస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆరోగ్యశ్రీ వర్తించక వైద్యం చేయించుకోలేకపోతున్నామని వాపోయారు. పింఛన్లు తీసేశారని, ఇళ్లు మంజూరు చేయడం లేదని, మంచినీటి సౌకర్యం లేదని ఇలా పెద్ద సంఖ్యలో వినతులు వెల్లువెత్తాయి. అడుగడుగునా ఎదురేగి స్వాగతం పలికిన ప్రజలు తాము పడుతున్న కష్టాలను చెబుతుంటే జననేత సైతం చలించిపోయారు. ఆరు నెలలు ఓపిక పట్టండి..మనందరి ప్రభుత్వం వస్తుంది..మీ అందరికీ నేను అండగా ఉంటా..మీ కష్టాలన్నీ గట్టెక్కిస్తా అంటూ భరోసా ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతూ ముందుకు సాగారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ, జాతీయ కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, శాసనసభ పక్ష ఉపనాయకుడు బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, పాదయాత్ర టూర్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, నర్సీపట్నం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్‌ గణేష్, అరకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శతృచర్ల పరీక్షిత్‌రాజు, ప్రముఖ ఆడిటర్‌ జి.వెంకటేశ్వరరావు, సమన్వయకర్తలు కేకేరాజు, కరణం ధర్మశ్రీ, శెట్టి ఫాల్గుణ, గొల్ల బాబూరావు, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, సీఈసీ సభ్యులు కాకర్లపూడి శ్రీకాంత్, అంకంరెడ్డి జమీల్, రాష్ట్ర అధికార ప్రతినిధులు కొయ్య ప్రసాదరెడ్డి, అరుణ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి గుడ్ల పోలిరెడ్డి,  జాన్‌ వెస్లీ, తాడి విజయభాస్కరరెడ్డి, నంబూరు శంకరరావు, శిరుప శ్రీనివాసరెడ్డి, జిల్లా నాయకులు కుంభా రవిబాబు, కమ్మిడి అశోక్, చొక్కాకుల వెంకటరావు, రామకృష్ణ, బొడ్డేడ ప్రసాద్, రుత్తల ఎర్రాపాత్రుడు, మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పోతల ప్రసాద్, లాలం బాబ్జీ, రూరల్‌ జిల్లా మహిళ అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, గవిరెడ్డి సన్యాసినాయుడు, డాక్టర్‌ లక్ష్మీకాంతం, సీతన్నరాజు, కిరణ్‌రాజు, రవిరెడ్డి, పక్కి దివాకర్, వెంపాడ శ్రీనివాసరెడ్డి, సుర్ల సత్యనారాయణ, సిరసపల్లి నాని, మొకల బాలకృష్ణ, జడ్పీటీసీ సభ్యురాలు సీహెచ్‌. సువర్ణలత, బోడపాటి సుబ్బలక్ష్మి, చోటీ, ఎ.రాజబాబు, జల్లి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

అభిమానం చాటుకుంటూ..
మాకవరపాలెం(నర్సీపట్నం): ఓ దివ్యాండు డు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన అభిమానాన్ని చాటుకున్నాడు. నర్సీపట్నం మండలం పెదబొడ్డేపల్లికి చెందిన కంపరా దీపక్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.200 పింఛను అందించారు. దీంతో ఆయనపై అభిమానాన్ని పెంచుకున్న దీపక్‌ జగన్‌ పాదయాత్ర ఇటుగా వస్తుండటంతో తన ట్రై సైకిల్‌కు వైఎస్సార్‌ పార్టీ జెండాలు, మైక్, ఫ్లెక్సీలతోపాటు ఫ్యాన్‌ గుర్తులను తగిలించి పాదయాత్రకు వచ్చాడు. శనివారం కృష్ణాపురం నుంచి పెదబొడ్డే పల్లి వరకు పాదయాత్రలో సాగుతూ తన అభిమానాన్ని చాటుకున్నాడు.

సీఆర్పీలను ఆదుకోవాలి
ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు బడి బయటకు రాకుండా స్కూల్‌ కాంప్లెక్స్‌ల నిర్వహణ, పలు సర్వేలు, ప్రశ్నాపత్రాలు పంపిణీ, స్కూల్‌ కేరింగ్, ఆధార్‌ సీడింగ్, ప్రత్యేక అవసరాల విద్యార్థుల సర్వే వంటివి ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా మాకు సమాన వేతనం చెల్లించడంలేదు. టీఏ,డీఏలు ఇవ్వడంతో పాటు మహిళలకు 180 రోజులతో కూడిన ప్రసూతి వేతనం, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుహక్కు కల్పించాలి. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న సీఆర్పీల కుటుంబాలకు న్యాయం చేయాలి.                  
– రుత్తల రాజాచంద్ర, క్లస్టర్‌ రీసోర్స్‌ పర్సన్‌ వెల్ఫేర్‌ 
అసోసియేషన్, రాష్ట్ర కో–కన్వీనర్‌ 

మంత్రి అయ్యన్న అడ్డుకుంటున్నారు
తూర్పు కాపులకు బీసీ–డీ ధ్రువపత్రాలు ఇవ్వకుండా మంత్రి అయ్యన్నపాత్రుడు అడ్డుకుంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న తూర్పుకాపులకు 1970లో 1793 నంబర్‌తో జీవో ఇచ్చారు. దీని ఆధారంగా విశాఖ జిల్లాలో 2011 అక్టోబర్‌ 3న అప్పటి కలెక్టర్‌ తూర్పు కాపులకు బీసీ–డీ ధ్రువపత్రాలు ఇవ్వాలని తహశీల్దార్లకు ఉత్తర్వులు ఇచ్చారు. కాని వీటిని ఇవ్వకుండా మంత్రి అయ్యన్న తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి తమ సమాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని అడ్డుకుంటున్నారు. దీనివల్ల మా పిల్లల భవిష్యత్తు అర్థం కావడం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే మా సమస్య పరిష్కరిస్తారన్న ఆశతో ఆయనకు వినతి పత్రం అందజేశాం.
– గొంతిన హరిబాబు, 
తూర్పుకాపు సంఘం అధ్యక్షుడు, మాకవరపాలెం మండలం

కమీషన్‌ పెంచాలి
స్పాట్‌ బిల్లింగ్‌ మీటర్‌ రీడర్స్‌కు కమీషన్‌ పెంచాలి. నెలకు ఒక్కొక్కరం 4వేల మీటర్లకు రీడింగ్‌లు తీస్తున్నాం. ఒక్కో రీడింగ్‌ తీసేందుకు రూ.1.90పైసలు వస్తోంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 2016లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డికి బి.వెంకట సూరి అప్పారావు, వంటాకులు శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశాం.
– స్పాట్‌ బిల్లింగ్‌ మీటర్‌ రీడర్స్, నర్సీపట్నం మండలం 

మరిన్ని వార్తలు