వాన జోరు.. జన హోరు

19 Aug, 2018 06:28 IST|Sakshi

ఉత్సాహం ఉరకలెత్తింది.. అభిమానం కట్టలు తెంచుకుంది. 
ఆ ఉత్సాహానికి.. ఆ అభిమానానికి.. జోరువాన కూడా అడ్డుకట్ట వేయలేకపోయింది.. 
ఉదయం నుంచే ప్రజాసంకల్ప యాత్ర సాగిన దారి పొడవునా వరుణుడు జననేతను అనుసరించాడు.. అద్వితీయమైన జనస్పందనను చూసి ముత్యాల జల్లు కురిపించాడు..

నర్సీపట్నం బహిరంగ సభ వద్దా అదే సీన్‌ ఆవిష్కృతమైంది.. మధ్యలో కాసేపు తెరిపిచ్చిన వాన.. మధ్యాహ్నం మళ్లీ మొదలైంది.. జిల్లాలోనే తొలి సభ అయిన నర్సీపట్నంలో జగనన్న ఏం చెబుతారోనన్న ఉత్సుకత.. ఆయన్ను చూడాలన్న ఆకాంక్షతో మధ్యాహ్నం నుంచే పట్నానికి జనప్రవాహం మొదలైంది.. వర్షాన్నీ లెక్క చేయని ప్రజ ప్రవాహం సభ జరిగే శ్రీకన్య డౌన్‌ పరిసర ప్రాంతాలన్నింటినీ ముంచెత్తింది... మేడలు, మిద్దెలు, షాపులు.. చివరికి సమీపంలోని సినిమా థియేటర్‌ గోడలు జనంతో నిండిపోయాయి.. 

ఇక ప్రధానం మార్గం కనుచూపు మేర జనసంద్రాన్ని తలపించింది. జనవర్షాన్ని చూసి ఉప్పొంగిపోయిన జననేత సర్కారు అవినీతిపై.. స్థానిక ప్రజాప్రతినిధి అయిన మంత్రిపై విమర్శల తూటాలు పేల్చారు.. స్థానిక సమస్యలు పరిష్కారమయ్యాయా?.. అని ప్రశ్నిస్తూ జనం నుంచే ‘లేదన్న’ సమాధానం చెప్పించారు.. జనం అడుగు కదపలేదు.. చూపు తిప్పలేదు.. గొడుగులు వేసుకొని మరీ ప్రసంగాన్ని శ్రద్ధగా విని జననేతకు జేజేలు పలికారు.

సాక్షిప్రతినిధి, విశాఖపట్నం: వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. అయితే జననేతను చూడాలన్న అభిమానం వర్షాన్ని లెక్కచేయలేదు. నర్సీపట్నం చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా శనివారం సాయంత్రం శ్రీకన్య డౌన్‌ వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించిన బహిరంగ సభకు నర్సీపట్నం ప్రజ పోటెత్తింది. స్వచ్చందంగా.. వేలాదిగా తరలి వచ్చింది. జోరున వర్షం కురుస్తున్నా ఏమాత్రం కదలకుండా ఆయన ప్రసంగం ఆద్యంతం విని జయజయధ్వానాలు చేశారు. ప్రజాసంకల్ప యాత్ర 239వ రోజైన శనివారం ఉదయం నాతవరం మండలం ములగపూడి శివారులో ప్రారంభమై మధ్యాహ్నం బలిఘట్టం వద్ద భోజన విరామం అనంతరం నర్సీపట్నంలోకి అడుగుపెట్టింది. 

బహిరంగ సభ జరిగే ప్రదేశానికి పాదయాత్ర చేరుకునే సరికి ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. వర్షాన్ని లెక్కచేయకుండా నడిరోడ్డుపైనే నిల్చున్న జనాభిమానాన్ని చూసి వై.ఎస్‌.జగన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రసంగం ప్రారంభంలో ఇదే ప్రస్తావించారు. ‘నీకు మేమంతా అండగా ఉన్నామంటూ జోరు వర్షంలోనూ నాతో నడిచారు. స్వచ్చందంగా కదలి వచ్చారు. మీ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని’ ఆయన ప్రస్తావించడంతో జనం కేరింతలు కొట్టారు. ప్రసంగం మధ్యలో‘‘జగన్‌ మీ అందరి వాడు.. మీ బిడ్డకు మీ అందరి ఆశీస్సులు కావాలి’.. అనగానే.. మేమంతా మీ వెంటే అన్నట్టుగా చప్పట్లతో సంఘీభావం ప్రకటించారు. సీఎం..సీఎం అంటూ వారు చేసిన నినాదాలతో నర్సీపట్నం హోరెత్తిపోయింది.

మంత్రి అయ్యన్నపై నిప్పులు 
ఓ సీనియర్‌ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమంటే ఎలా ఉండాలి. కానీ నర్సీపట్నమే కాదు.. రాష్ట్రమంతటా ఇదే దుస్థితి. సరైన రోడ్లు కూడా వేసుకోలేని మంత్రి అయ్యన్న అవినీతి మాత్రం అంతా ఇంతా కాదు. రాష్ట్రమంతా చర్చించుకునేట్టుగా ఆయన అవినీతి సాగుతోంది. నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలో లేటరైట్‌ తవ్వకాలను బినామీల పేరిట పంచుకుని 30 శాతం కమీషన్‌ దోచుకుంటున్నారని వై.ఎస్‌.జగన్‌ ధ్వజమెత్తారు. ఇదేమిటని ప్రశ్నించి తవ్వకాలను అడ్డుకున్న గ్రామాలకు కరెంట్‌ కట్‌ చేసినంతటి అరాచకం ఇక్కడ నడుస్తోంది. నర్సీపట్నం మున్సిపాల్టీలో మంచినీళ్లు ప్రజలకందించలేని.. డ్రైనేజీ వ్యవస్థను కూడా బాగుచేయలేని అసమర్ధ అయ్యన్న అంటూ జగన్‌ విమర్శించినప్పుడు జనం నుంచి అనూహ్య స్పందన వచ్చింది.

నర్సీపట్నానికి సెజ్‌ వచ్చిందా?.. మీరే చెప్పండి
ఇక సీఎం చంద్రబాబు, మంత్రి అయ్యన్నలు ఇచ్చిన హామీలు అమలయ్యాయా.. అని ఆయన ప్రశ్నించగా ప్రజలు రెండు చేతులు పైకెత్తి కాలేదన్నా..కాలేదన్నా.. అన్న సమాధానాలతో సభా ప్రాంతమంతా మార్మోగిపోయింది. ధర్మసాగరంలో జరిగిన జన్మభూమి సభకు వచ్చినప్పుడు చంద్రబాబు, స్థానిక మంత్రి కలిసి నర్సీపట్నంలో సెజ్‌ పెడతామని.. పరిశ్రమలు తీసుకొస్తామని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలొచ్చాయా? ఉద్యోగాలొచ్చాయా? అని వై.ఎస్‌.జగన్‌ ప్రశ్నించగా జనం లేదన్నా.. లేదన్నా అని సమాధానం ఇచ్చారు. నర్సీపట్నాన్ని మోడల్‌ టౌన్‌గా చేస్తామని హామీ ఇచ్చారు. మీకు ఎక్కడైనా కన్పించిందా? అని అడుగుతున్నా అని అనగానే లేదు లేదు అంటూ బదులిచ్చారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, నర్సుల ఖాళీల గురించి పక్కా లెక్కలతో ఎండగట్టిన వైనం జనాన్ని ఆలోచింపచేసింది.

పార్టీ శ్రేణుల్లో ఉరకలేసిన ఉత్సాహం
ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి వైఎస్‌ జగన్‌ ఎలాంటి వేదికలపైనా మాట్లాడలేదు. తొలిసారిగా నర్సీపట్నంలో ఆయన ప్రసంగించే బహిరంగ సభకు వర్షాల కారణంగా ఏ మేరకు జనం వస్తారోనన్న సందేహా లను పటాపంచలు చేస్తూ వేలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చారు. దీంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. 23 నిమిషాలే మాట్లాడినప్పటికీ స్థానిక మంత్రి అవినీతి, అసమర్ధతలపై నిప్పులు చెరగడం.. చంద్రబాబు నిర్వాకాలను ఎత్తిచూపడం తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు తాను అధికారంలోకి రాగానే ఏం చేయగలనో వివరిస్తూ వై.ఎస్‌.జగన్‌ చేసిన ప్రసంగం పార్టీ శ్రేణులకే కాదు పట్టణ ప్రజలకూ నైతిక స్థైర్యాన్నిచ్చింది.

ప్లాట్లపై రూ.3 లక్షల అప్పు మాఫీ చేస్తా
దివంగత వైఎస్సార్‌ హయాంలో బలిఘట్టం సమీపంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 22 ఎకరాలు సేకరిస్తే ఆ భూముల్లో ప్లాట్లు కట్టిస్తామని చంద్రబాబు చెబుతున్నాడు. ప్లాట్లు పొందిన లబ్దిదారులకు రూ.3 లక్షలు అప్పు పెడతారట..దాన్ని ప్రతి నెలా 3వేల చొప్పున చెల్లించాలట. ప్లాట్లు ఇస్తే తీసుకోండి. మనందరి ప్రభుత్వం రాగానే మీరు చెల్లించాల్సిన రూ.3లక్షల అప్పు మాఫీ చేస్తానని ప్రకటించడానే ప్రజల నుంచి హర్షధ్వానాలు మిన్నంటాయి.

జోరువానలో జననేతకు తోడుగా..ప్రజాసంకల్ప యాత్ర నుంచి..
నర్సీపట్నం నియోజకవర్గంలో శనివారం జరిగిన ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నడిచారు. భోజన విరామం అనంతరం బలిఘట్టం నుంచి ప్రారంభమయిన పాదయాత్ర భోరున వర్షం పడుతున్నప్పటికీ కొనసాగింది. మధ్యాహ్నం జరిగిన పాదయాత్రలో విజయసాయి రెడ్డి వైఎస్‌ జగన్‌ వెంట నడిచారు. నర్సీపట్నం ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో జరిగిన బహిరంగ సభ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం.. ఆదివారం మాకవరపాలెం మండలంలో పాదయాత్ర జరిగే ప్రాంతాల గురించి స్థానిక నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సీపట్నంలో జరిగిన బహిరంగ సభలో భారీ వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ప్రజలు జగన్‌ ప్రసంగం కోసం వేచి ఉన్నారంటే ఆయనపై ఉన్న నమ్మకమే కారణమన్నారు. జగన్‌ సీఎం కావాలని యావత్‌ రాష్ట్రం కోరుకుంటోందన్నారు. ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ప్రజాదరణే ఇందుకు నిదర్శనమన్నారు.

ప్రజల మనసును తాకుతూ.. భరోసా కల్పిస్తూ..
కోటవురట్ల (పాయకరావుపేట): వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ప్రజల మనసును తాకుతూ దిగ్విజయంగా సాగుతోందని రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. తంగేడులోని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్‌ సెల్‌ అధ్యక్షుడు డీవీ సూర్యనారాయణరాజు నివాసంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్యనాయకులు, బూత్‌ కమిటీ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. జననేతకు విశాఖ జిల్లాలో అపూర్వమైన రీతిలో స్వాగతం లభించిందన్నారు. విశాఖ జిల్లాలో పాదయాత్రను మిగతా జిల్లాలకు భిన్నంగా విజయవంతం చేయాలన్నారు. ప్రస్తుత టీడీపీ పాలనలో ప్రజలు దుర్భరమైన సమస్యలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఫ్లైట్, ట్రైన్, బస్సుల్లో ప్రయాణం చేసినపుడు అనేక సార్లు  ప్రజల భావాలను చాలా స్పష్టంగా గమనించానని, జగన్‌ అధికారంలోకి వస్తే మేలు చేస్తాడని ప్రతీ ఒక్కరి మనసులో ఉందన్నారు. 

మరిన్ని వార్తలు