అవినీతిలో ఏపీ నెంబర్ వన్

20 Mar, 2017 15:29 IST|Sakshi
అవినీతిలో ఏపీ నెంబర్ వన్

అమరావతి: ఎన్‌సీఏఈఆర్ సర్వే ప్రకారం అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్ వన్ స్థానంలో ఉందని తేలిందని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజాలు చెప్పి ఉంటే సంతోషించేవాళ్లమని, ఆయన సుదీర్ఘంగా మాట్లాడి అబద్దాలను నిజం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు.

నష్టాలు పెరిగినా విద్యుత్ సంస్థలకు అవార్డులు వచ్చాయని చెబుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. సభను తప్పుదోవ పట్టించే అలవాటు చంద్రబాబుకే ఉందని విమర్శించారు. తప్పుడు లెక్కలు చూపించడం మనకు అలవాటేనని ఎల్లంపల్లిపై చర్చ సమయంలో చంద్రబాబే చెప్పారని పేర్కొన్నారు. గతేడాది మైనార్టీల సంక్షేమానికి 623 కోట్ల రూపాయలు కేటాయించి. 472 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. బీసీలకు 4066 కోట్లు కేటాయించి, 2847 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు.

కాపులకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని వైఎస్ జగన్ విమర్శించారు. విడుదల చేసిన డబ్బులను ఎందుకు ఖర్చు పెట్టడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. మంజునాథ్ కమిషన్ సంగతేంటని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి గురించి చంద్రబాబు చెప్పిందేమిటి, ప్రస్తుతం చేస్తున్నదేమిటని ఎండగట్టారు.

బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత మాట్లాడకుండా అధికార పార్టీ సభ్యులు పలుమార్లు అడ్డుతగిలారు. దీంతో వైఎస్ జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సభలో నినాదాలు చేశారు. ఓ దశలో స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలిపారు. వైఎస్ జగన్ మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారు. వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగారు. చర్చను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు.