7న సీఎం రాక

3 Feb, 2020 13:35 IST|Sakshi

రాజమహేంద్రవరంలో జగన్‌ పర్యటన

రాష్ట్రంలోనే తొలిసారిగా‘దిశ’ పోలీసు స్టేషన్‌కు ప్రారంభోత్సవం

‘నన్నయ’లో ‘దిశ’ యాప్‌ ప్రారంభం

ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

తూర్పుగోదావరి, రాజానగరం/రాజమహేంద్రవరం క్రైం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7న రాజమహేంద్రవరం రానున్నారు. ఆ రోజు ఉదయం అర్బన్‌ జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణానికి హెలికాప్టర్‌లో ఆయన చేరుకుంటారు. ఉదయం 11.50 గంటలకు స్వామి థియేటర్‌ ఎదురుగా నూతనంగా నిర్మించిన ‘దిశ’ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి ఆదికవి నన్నయ యూనివర్సిటీకి చేరుకుంటారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొంచిన ‘దిశ’ యాప్‌ను, ‘దిశ’ పోలీసు స్టేషన్ల పనితీరుకు సంబంధించిన బుక్‌లెట్‌ను ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని 18 ‘దిశ’ పోలీసు స్టేషన్లకు     సంబంధించిన అధికారులతో నిర్వహించే వర్క్‌షాప్‌లో సీఎం ప్రసంగిస్తారు. ఇందులో 500 మంది అధికారులకు, సిబ్బందికి ‘దిశ’ చట్టం విధివిధానాలపై దిశానిర్దేశం చేస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ వర్క్‌షాప్‌ జరుగుతుంది. వర్క్‌షాపును ప్రారంభించి, ప్రసంగించిన అనంతరం సీఎం తిరుగుపయనమవుతారని డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం డీఐజీ (టెక్నికల్‌) పాల్‌రాజ్, అర్బన్‌ జిల్లా ఎస్పీ షిమోషి బాజ్‌పేయ్‌ తదితరులు పరిశీలించారు. రాష్ట్రంలోని 1,100 పోలీసు స్టేషన్లలో ఉన్న సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రిజిస్ట్రార్‌ గంగారావు, ఏడీఎస్పీ లతామాధురి, డీఎస్పీలు రవికుమార్, సంతోష్, శ్రీనివాస్‌రెడ్డి, సత్తిరాజు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరంలో మొదటి ‘దిశ’ స్టేషన్‌
రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ‘దిశ’ చట్టం తీసుకురావడంతో పాటు ప్రత్యేకంగా 18 ‘దిశ’ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో తొలిగా రాజమహేంద్రవరం ‘దిశ’ పోలీసు స్టేషన్‌ను ఆయన ప్రారంభించనున్నారు. రాజమహేంద్రవరం స్వామి థియేటర్‌ ఎదురుగా ఒక భవనాన్ని ‘దిశ’ పోలీసు స్టేషనుగా అభివృద్ధి చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డితో పాటు అదనంగా మరో డీఎస్పీని కూడా ఈ స్టేషన్‌కు నియమించారు. ప్రతి ‘దిశ’ పోలీసు స్టేషన్‌కు ఇద్దరు డీఎస్పీలతో పాటు ఐదుగురు ఎస్సైలు, 10 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 30 మంది కానిస్టేబుళ్లతో పాటు అవసరమైన వాహనాలను సమకూరుస్తూ జనవరి 31న జీఓ 18 జారీ చేశారు.

మరిన్ని వార్తలు