కన్నీరు తుడిచి..తోడుగ నిలిచి

27 Nov, 2013 00:31 IST|Sakshi

సాక్షి, కాకినాడ  :  అన్నదాతల్లో మనోధైర్యం నింపుతూ..ఆపన్నులకు భరోసానిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని హెలెన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. నేలకొరిగిన పంటపొలాలను మోకాలు లోతు బురదలో దిగి స్వయంగా పరిశీలించారు. నేలనంటిన అరటితోటల్లోకి వెళ్లి రైతుల గోడు విన్నారు. తలతెగిన మొండి కొబ్బరిచెట్లను చూసి రైతన్నల వెతలు విన్నారు. హైదరాబాద్ నుంచి మధురపూడి చేరుకున్న జగన్ రాజానగరం, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ నియోజకవర్గాల మీదుగా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం వద్దకు వచ్చేసరికి వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఎదురేగి స్వాగతం పలికారు.

 ఏడాదిన్నర తరువాత బెయిల్‌పై బయటకొచ్చాక తొలిసారిగా కోనసీమలో అడుగుపెట్టిన జగన్‌తో పాటు బాధితులను పరామర్శించేందుకు పార్టీ నేతలతో పాటు వేలాదిగా పార్టీ శ్రేణులు జనసైన్యంలా కదిలివచ్చాయి. పుట్టెడు కష్టాల్లోఉన్నప్పటికీ జననేతను చూసేందుకు..తమ గోడు చెప్పుకునేందుకు కోనసీమ వాసులు కూడా అడుగుడుగునా రహదారికి ఇరువైపులా బారులు తీరారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తన నియోజకవర్గంలో హెలెన్  తుపాను వల్ల జరిగిన నష్టాన్ని జగన్‌కు వివరించారు. రావులపాలెం నుంచి కొత్తపేట మీదుగా వెలిశెట్టివారిపాలెంకు చేరుకున్న జగన్ నేలకొరిగిన అరటి తోటలను పరిశీలించి అరటి రైతులతో మాట్లాడారు.

రూ.70వేల నుంచి 80వేల వరకు పెట్టుబడులు పెట్టామని.. రూ.30 వేలు శిస్తు చెల్లించాల్సి ఉందని తీరా పంట చేతికందే సమయంలో హెలెన్ విరుచుకుపడడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం* అంటూ అరటి రైతులు గోడు చెప్పుకోగానే జగన్ చలించిపోయారు. ఈ ప్రభుత్వానికి మనసులేదు..మనసున్న వారు పాలకులుగా లేకపోవడం వల్లనే రైతులకీ దుస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ నుంచి దారిపొడవునా బాధితులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు..యువకులు బారులు తీరడంతో కోనసీమ పర్యటన ఆద్యంతం సుమారు ఐదుగంటలకు పైగా ఆలస్యంగా కొనసాగింది. ఎక్కడికక్కడ బాధితులు బారులు తీరి కాన్వాయ్‌కు అడ్డపడడంతో ఆయన పర్యటన ముందుకు సాగడం కష్టమైంది. దారిలో నేలనంటిన పొలాలను చూపిస్తూ పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యే గొల్లబాబూరావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌లు కోనసీమలో నూరు శాతం వరిపంట నాశనమైందని..వే లాది కొబ్బరిచెట్లు నేలకొరిగాయని, 10వేలకు పైగా ఎకరాల్లో అరటితోటలు పడిపోయాయని వివరించారు.

ముక్కామల, నేదునూరిచినపాలెం, మొసలపల్లి, పాలగుమ్మి, నడిపూడి మీదుగా ఈదరపల్లి వంతెన వరకు కాలువగట్టు... బాధితులతో కిక్కిరిసిపోయింది. అడుగడుగునా వీరు జగన్‌కు ఎదురేగి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జగన్ కూడా ఓపిగ్గా బాధితులున్న ప్రతిచోటా ఆగి వారి వెతలు వింటూ సమస్యల పరిష్కారానికి భరోసానిస్తూ ముందుకు కదిలారు. ఇళ్లు కూలిపోయాయి..కనీసం కేజీ బియ్యం కూడా ఇవ్వలేదు అంటూ ఎన్.చినపాలెం వద్ద లక్ష్మీనరసమ్మ అనే వృద్ధురాలు జగన్ వద్ద వాపోయింది. పాలగుమ్మి, నడిపూడి లాకుల వద్ద వృద్ధులను పలుకరించి ఁతుపాను సాయం అందిందా* అంటూ ఆరా తీయగా వారం రోజులవుతున్నా కనీసం ఎలాంటి సాయం అందలేదని వారు చెప్పారు.
 మంచిరోజులొస్తాయి.. ధైర్యంగా ఉండండి
 అమలాపురం మీదుగా ముమ్మిడివరం మండలం చెయ్యేరు అగ్రహారం చేరుకున్న జగన్ నేలకొరిగిన పంటపొలాల్లోకి దిగి పరిశీలించారు. రైతులు వారిస్తున్నా మోకాలు లోతు బురదలోకి దిగి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. నేను మూడు ఎకరాలు కౌలుకు చేశాను..నాకు ఇద్దరు పిల్లలు.. ఇల్లు..వాకిలి చివరకు మా ఆవిడ పుస్తెలతో సహా తాకట్టు పెట్టి సాగు చేశాను.. తీరా పంటచేతికొచ్చే సమయంలో ఇలా జరిగింది..నాకు చావు తప్ప మరోగత్యంతరం లేదంటూ గాలిదేవర పేరయ్యనాయుడు పురుగు మందు డబ్బా చూపిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేయగా, జగన్‌తో సహా అక్కడున్న వారంతా వారించి త్వరలోనే మీ అందరికి మంచిరోజులొస్తాయి ధైర్యంగా ఉండమని చెప్పారు. చెయ్యేరు వద్ద బర్ల చినవ్బైయి తాను మూడెకరాలు సాగు చేశాను.

ఎకరాకు రూ.20వేలు పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు కనీసం ఎకరాకు బస్తా కూడా వచ్చే పరిస్థితి లేదు..రాజన్న పోయిన తర్వాత రైతుల బతుకులు అధ్వానంగా తయారయ్యాయంటూ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నీలం తుపాను సాయం అందిందా అని ఆరా తీయగా ఇప్పటి వరకు రాలేదని చెప్పాడు. తుపాను ప్రభావానికి గురైన రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, కొత్త రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. మీ తరఫున పోరాడతానని రైతులకు భరోసా ఇచ్చారు.
 సమైక్యాంధ్ర ఉద్యమకారుడి  కుటుంబానికి పరామర్శ
 అనంతరం ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమంలో మృతిచెందిన కాట్రేనికోన మండల వైఎస్సార్ సీపీ సేవాదళ్ కన్వీనర్ గిడ్డి దివాకర్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో దివాకర్ చురుగ్గా పాల్గొన్నాడని, దీక్షలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడని పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుత్తుల సాయి జగన్‌కు వివరించారు. తాను కూడా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్నానని, మీకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ఆ కుటుంబానికి జగన్ భరోసానిచ్చారు. మధ్యాహ్నం  మూడు గంటలకే కాట్రేనికోన చేరుకోవాల్సి ఉన్నప్పటికీ రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నప్పటికీ వందలాది మంది బాధితులు, మహిళలు కాట్రేనికోన సెంటర్‌లో ఆయన రాకకోసం సుమారు ఐదుగంటల పాటు వేచి ఉన్నారు.

అంగన్‌వాడీ కార్యకర్తలు తమ సమస్యలను జగన్‌కు వివరించారు. మత్స్యకారులు పట్టుబట్టడంతో కాట్రేనికోన సెంటర్‌లో ప్రసంగిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు.. రైతులు.. బాధితులు గోడు చెబుతుంటే గుండె తరుక్కు పోయింది ..ఇలాంటి ప్రభుత్వ పాలనలో నేను ఈ రాష్ర్టంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా.. కానీ ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎంకు సిగ్గులేకపోవడం బాధాకర మన్నారు. ఐదురోజులుగా వర్షాలు కురిసినా కనీసం ఏం జరిగిందని అడిగే నాధుడే లేరు.. కనీసం కేజీ బియ్యం కానీ. లీటర్ కిరసనాయిలు కానీ ఇవ్వలేదంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. మరో నాలుగు నెలలు ఓపిక పట్టండి..మన ప్రభుత్వం వస్తుంది.. మిమ్మల్నందర్ని ఆదుకుంటానని ధైర్యం చెప్పారు. అనంతరం మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాదరావు ఇంటికి వెళ్లి ఆయన్ని పలుకరించి మోకా ఆనందసాగర్‌తో మాట్లాడారు.
 కొవ్వొత్తులు, బుడ్డిదీపాలతో  ఎదురుచూపులు
 కోనసీమ అంతా అంధకారం అలముకున్నప్పటికీ తమ గోడు వినేందుకు వస్తున్న జగన్‌ను చూసేందుకు బాధితులు, మహిళలు బుడ్డిదీపాలు, కొవ్వొత్తులతో రోడ్డుపక్కనే నిలబడి ఎదురుచూశారు. జగన్ రాగానే వారి ఆవేదనను వెళ్లగక్కుకొని కన్నీరుమున్నీరయ్యారు. రాత్రి 10.35 గంటల సమయంలో ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ తనకోసం వందలాదిగా వేచి ఉన్న బాధితులు, మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు