జన ప్రభంజనం

12 Aug, 2018 07:15 IST|Sakshi

తునిలో జననేతకు నీరాజనాలు

2700 కిలోమీటర్లు దాటిన పాదయాత్ర

విజయవంతమైన బహిరంగ సభ

యనమలపై జగన్‌ నిప్పులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జననేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో తుని పట్టణం జనసంద్రమైంది. అభిమానుల సందడితో హోరెత్తింది. జననేత వెంట పడ్డ వేలాది అడుగులు ఒక్కటై గొల్ల అప్పారావు సెంటర్‌కు చేరుకున్నాయి. సభాప్రాంగణమంతా ఒక్కసారిగా కిటకిటలాడింది. ప్రజా సంకల్ప యాత్ర 2700 కిలోమీటర్ల మైలురాయి దాటిన గడ్డగా తుని చరిత్రలో లిఖించబడింది. జననేత పాదయాత్రతో పాటు బహిరంగ సభకు హాజరై మునుపెన్నడూ లేని విధంగా ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభను విజయవంతం చేయడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది. జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 234వ రోజైన శనివారం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని డీజే పురం నుంచి ప్రారంభమై తుని నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

అవినీతిలో ముందున్నారు : యనమలపై ధ్వజం
స్పీకర్‌గా, మంత్రిగా సుదీర్ఘకాలంగా పని చేసిన యనమల హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చెందకపోగా అవినీతిలో మాత్రం ముందుకు పరుగెడుతుందని జగన్‌ ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో యనమల హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. తాండవ నదిలో ఇసుకను దోచేయడమే కాకుండా ఆ ఇసుకను సముద్రం ఇసుకతో కలిసి అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. కేవలం టీడీపీ నాయకులు దోచుకునేందుకే ఇసుకను ఫ్రీ అంటున్నారని ఆరోపించారు. 

నియోజకవర్గంలో వల్లూరు, శృంగవృక్షం, పైడికొండ తదితర గ్రామాల చెరువుల్లో తాడిచెట్టు లోతులో ఇసుక, మట్టి తవ్వి లక్ష ట్రాక్టర్లకు పైగా అమ్ముకున్నారంటూ ప్రజలు చెబుతున్నారని తెలిపారు. చెరువు తవ్వినందుకు బిల్లులు తీసుకోవడంతో పాటు ఆ మట్టిని అమ్ముకుని కూడా సంపాదించుకున్నారని తెలిపారు. ఆర్థిక మంత్రి నియోజకవర్గంలో మరుగుదొడ్లకు కూడా లంచాలు వసూలు చేస్తున్నారని, పైడికొండలో రూ.60 లక్షలు లూటీ చేస్తే వైఎస్సార్‌ సీపీ ధర్నా చేసేంత వరకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. 

తొండంగి మండలం పి.అగ్రహారంలో ఉత్తరాదిమఠానికి చెందిన 420 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ మేరకు రికార్డులు తారుమారు చేసి వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నా చర్యలు లేవని ప్రశ్నించారు. చివరికి తొండంగి మండలం ఒంటిమామిడితో పోలీస్‌స్టేషన్‌ కోసం భూములిస్తే దాంతో పాటు పక్కనే ఉన్న భూమిని కూడా కబ్జా చేసి షాపింగ్‌ కాంప్లెక్స్‌ కడుతున్నారని విపక్ష నేత మండిపడ్డారు. తుని పోలీస్‌ స్టేషన్‌ పక్కనే ఉన్న బాతులు కోనేరును కూడా కప్పి దాన్ని కబ్జా చేశారని, చివరకు డ్రైనేజీ భూములు కూడా కబ్జా చేయడంతో తుని పట్టణంలో పది వార్డుల్లో మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

పాదయాత్రలో పార్టీ శ్రేణులు:
ఉభయ గోదావరి జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి కె.పార్థసారథి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినిపే విశ్వరూప్, తలశిల రఘురామ్, పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, సమన్వయకర్తలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, జ్యోతుల చంటిబాబు, పొన్నాడ సతీష్‌కుమార్, అనంత ఉదయభాస్కర్, తోట సుబ్బారావునాయుడు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, కాకినాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, పార్టీ నాయకులు కొల్లి నిర్మలకుమారి, మిండగుదిటి మోహన్, విప్పర్తి వేణుగోపాల్, ముదునూరి మురళీకృష్ణంరాజు, దవులూరి దొరబాబు, పితాని అన్నవరం, కర్రి పాపారాయుడు, మేడపాటి షర్మిలారెడ్డి, పి.సోనీవుడ్, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కుసుమంచి శోభారాణి, డీసీసీబీ డైరెక్టర్‌ పోలిశెట్టి సోమరాజు, కొయ్య శ్రీనివాస్‌ అధిక సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు