వనం ఉంటేనే మనం

1 Sep, 2019 04:38 IST|Sakshi
శనివారం గుంటూరు జిల్లా డోకిపర్రులో జరిగిన వనమహోత్సవంలో ప్రతిజ్ఞ చేస్తున్న సీఎం జగన్‌

వన మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

నవ్యాంధ్రప్రదేశ్‌ను పచ్చని హారంగా తీర్చిదిద్దుకుందాం 

నింగి, నేల, నీరు,గాలిని కాపాడుకోవాలి 

రాష్ట్రంలో 33 శాతం భూభాగంలో అడవులను పెంచాలి  

ఈ సీజన్‌లో 25 కోట్ల మొక్కలు నాటబోతున్నాం  

కాలుష్య నియంత్రణ మండలిని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం 

పరిశ్రమల కాలుష్యాన్ని నివారించే బాధ్యత ప్రభుత్వానిదే.. 

ఆర్టీసీలో కొత్తగా 1,000 ఎలక్ట్రికల్‌ బస్సులు తీసుకొస్తున్నాం

సాక్షి, అమరావతి బ్యూరో: మనం నాటే ప్రతి మొక్క భూమాతకు ఎనలేని మేలు చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఈ సృష్టిలో సమతూకం ఉండాలంటే అందరూ కచ్చితంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అడవులను పెంచితేనే భూమిపై మనుషుల మనుగడ కొనసాగుతుందని ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు వద్ద శనివారం 70వ వన మహోత్సవాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేప మొక్క నాటారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన జీవ వైవిధ్యం, వన్యప్రాణి సంరక్షణ ప్రదర్శనశాలను తిలకించారు. అనంతరం అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. రాష్ట్ర భూభాగం 37,258 చదరపు కిలోమీటర్లు ఉంటే, ఇందులో 23 శాతం భూభాగంలో మాత్రమే అడవులు ఉన్నాయని తెలిపారు. జాతీయ అటవీ విధానం ప్రకారం 33 శాతం భూభాగంలో అడవులు పెంచాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇంకా ఏం చెప్పారంటే.. 

‘‘కేవలం రెండు మూడు నెలలు మాత్రమే ఉండే పంటలు వేస్తుండడం, మిగతా తొమ్మిది నెలలు భూమిపైకి నేరుగా సూర్యకిరణాలు పడుతుండడం వల్ల రాయలసీమ జిల్లాలు మరింత వేగంగా ఎడారిగా మారుతున్నాయని సీనియర్‌ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ ఒక సందర్భంలో చెప్పారు. సంవత్సరమంతా భూమిపై పచ్చదనం ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు. పర్యావరణం బాగుంటేనే మనమంతా బాగుంటాం. అందుకే పర్యావరణాన్ని తప్పనిసరిగా పరిరక్షించుకోవాలి. మన రాష్ట్రంలో 2,351 రకాల వృక్ష జాతులు, 1461 రకాల జంతు జాతులు ఉన్నాయి. కొన్ని జంతు జాతుల, వృక్ష జాతులు అంతరించిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడున్న పులుల సంఖ్య 48 మాత్రమే. వీటి గురించి మనం పట్టించుకోవడం మానేస్తే రాష్ట్రంలో ఇక పులులు అనేవే ఉండవు. సింహాలది కూడా అదే పరిస్థితి. 
వనమహోత్సవం కార్యక్రమానికి హాజరైన ప్రజానీకంలో ఓ భాగం 

25 కోట్ల మొక్కలు నాటుతాం 
మన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. వన మహోత్సవం సందర్భంగా ఈ సీజన్‌లో రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ వ్యవసాయ సీజన్‌లో ఇప్పటిదాకా 4 కోట్ల మొక్కలు నాటాం. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం కాదు, కనీసం మూడు, నాలుగు మొక్కలు నాటాలి. అప్పుడే మన రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతాం. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రజలకు మొక్కలు పంపిణీ చేస్తున్నాం. మొక్కల పెంపకం కార్యక్రమంలో భాగంగా పండ్ల చెట్లు, నీడనిచ్చే చెట్లు, ఎర్ర చందనం, టేకు.. ఇలాంటివి అక్షరాలా 12 కోట్ల మొక్కలు నాటడానికి అటవీ శాఖ సిద్ధంగా ఉంది. మరో 13 కోట్ల మొక్కలను మన పట్టు పరిశ్రమ శాఖ, ఉద్యానవన శాఖ, పేపర్‌ మిల్లులు నాటనున్నాయి. పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో తప్పనిసరిగా మొక్కలు నాటాలని కోరుతున్నా. 

పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. 
పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఇటీవల సమీక్ష చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు తెలిశాయి. రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చుకోవడానికి అడుగులు ముందుకు వేస్తున్నాం. ఏదైనా ఒక పరిశ్రమ వచ్చేటప్పుడు దానివల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందా లేదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాలుష్య నియంత్రణ మండలి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం. ఏదైనా పరిశ్రమ రావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే తొలుత ఆ ఫైల్‌ను పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు పంపించాలి. సదరు పరిశ్రమ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని లేదు అని బోర్డు ధ్రువీకరించిన తర్వాతే ఆ ఫైల్‌ ముందుకు కదిలేలా ప్రక్షాళన చేయబోతున్నాం. ఫార్మా రంగం ద్వారా భారీగా కాలుష్యం వెలువడుతోంది. ఇందులో చాలా వరకు వాతావరణంలో, సముద్రంలో కలిసిపోతోంది. ఇలాంటి పరిస్థితి మారాలి. పరిశ్రమలకు సంబంధించిన కాలుష్యాన్ని పూర్తిగా నివారించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. 

ఆర్టీసీలో ఎలక్ట్రికల్‌ బస్సులు 
ప్రజా రవాణా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. ఈ సంవత్సరం ఏపీఎస్‌ఆర్టీసీలో 1,000 ఎలక్ట్రికల్‌ బస్సులను తీసుకొస్తున్నాం. ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులను దశలవారీగా తొలగిస్తూ, ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. నింగి, నేల, నీరు, గాలి.. ఇవి కలుషితం అవుతుంటే కళ్లు మూసుకుని కూర్చోకూడదు. వాటిని కాపాడుకునే ప్రయత్నం అందరూ చేయాలి’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌ను పచ్చని హారంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా ఆరుగురు అటవీ శాఖ సిబ్బందికి ముఖ్యమంత్రి ఆయుధాలు అందజేశారు. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలందించిన 80 మంది అటవీ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు ఇచ్చి, సత్కరించారు. వన మహోత్సవంలో మంత్రులు మేకతోటి సుచరిత, పేర్ని వెంకట్రామయ్య, మోపిదేవి వెంకటరమణ, శాసన మండలిలో చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, సామినేని ఉదయభాను, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నంబూరు శంకర్రావు, కిలారి వెంకట రోశయ్య, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిబ్బంది, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా