ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ దిశగా సీఎం జగన్‌ అడుగులు

23 Oct, 2019 17:33 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం పైన బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పిల్లలు ఏం తింటున్నారో గమనించాలన్నారు. ఆ తర్వాత వారికి అందించే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలనే దానిపై సూచనలు చేయాలని కోరారు. ఇందుకోసం షోషకాహారంలో నిపుణులైన వారి సలహాలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌  అధికారులకు సూచించారు.

మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణలో భాగంగా.. మొదటి దశలో రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్‌ప్లాన్‌ ప్రాంతాల్లోని గర్భవతులు, 6 ఏళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని పెంచాలని.. దీనిని పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. 77 గిరిజన, సబ్‌ప్లాన్‌ మండలాల్లో డిసెంబర్‌ నుంచి ఈ పైలట్‌ ప్రాజెక్టు అమలు కానుంది.

వైఎస్సార్‌ బాల సంజీవని, వైఎస్సార్‌ బాలామృతం..
ఈ పైలట్‌ ప్రాజెక్టును అనుసరించి గర్భవతులకు, బాలింతలకు నెలకు రూ. 1062 విలువైన ఆహారం అందించనున్నారు. 25 రోజులపాటు రోజూ భోజనం, గుడ్డు, 200 మి.లీ. పాలతో పాటు రూ. 500 విలువ చేసే వైఎస్సార్‌ బాల సంజీవని కిట్‌ ఇస్తారు. వైఎస్సార్‌ బాల సంజీవని కిట్‌లో మొదటి వారం రెండు కేజీల మల్టీ గ్రెయిన్‌ ఆటా, రెండో వారం అర కేజీ వేరుశనగలతో చేసిన చిక్కీ, మూడో వారం అర కేజీ రాగి ఫ్లేవర్‌, అర కేజీ బెల్లం, నాలుగో వారం అర కేజీ నువ్వులుండలు అందజేస్తారు.

6 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు నెలలో ప్రతి రోజూ గుడ్డు, 200 మి.లీ. పాలు, వైఎస్సార్‌ బాలామృతం కిట్టు కింద రోజుకు రూ. 100 గ్రాముల చొప్పున 2.5 కేజీలు మొత్తంగా రూ. 600 విలువ చేసే పౌష్టికాహారం ఇవ్వనున్నారు. అలాగే 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నెలకు 25 రోజుల పౌష్టికాహారం అందజేయాలని నిర్ణయించారు. మొత్తంగా నెలకు రూ. 560లతో పౌష్టికాహారం అందించనున్నారు. ఈ మేరకు నెలలో 25 రోజులపాటు భోజనం, గుడ్డు, 200 మి.లీ. పాలు, పోషకాలు ఇచ్చే మరో అల్పాహారం అందజేస్తారు. 

పైలట్‌ ప్రాజెక్టు అమలయ్యే ప్రాంతాలు..
ఈ పైలట్‌ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం 36 గిరిజన మండలాలు ఎంపిక చేయగా.. శ్రీకాకుళం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలలో 7, విశాఖపట్నం జిల్లాలో 11, తూర్పు గోదావరి జిల్లాలో 11, పశ్చి​మ గోదావరి జిల్లాలో 6 ఉన్నాయి. సబ్‌ప్లాన్‌ ప్రాంతానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో 19, తూర్పు గోదావరి జిల్లాలో 4, విశాఖపట్నం జిల్లాలో 6, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 3 కలపి మొత్తం 41 మండలాలను ఎంపిక చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా