‘ఏపీలో పోలీసులకు బీమా పెంపు’

4 Dec, 2019 14:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న‘ పోలీసు సంక్షేమ నిధి’ నుంచి గ్రూపు ఇన్సూరెన్స్‌ విలువను భారీగా పెంచినట్లు సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రభుత్వం, పోలీసు శాఖల తరఫున యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ. 4.74 కోట్లను చెల్లించారు. పోలీసు బీమా మరింతగా పెరిగిందని.. దాదాపు 20 సంవత్సరాల తర్వాత పోలీసుల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌లో పెరుగుదల కనిపించిందని సీఎం జగన్‌ అన్నారు. గతంలో కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై వరకూ సుమారు రూ.13 లక్షల ఇన్సూరెన్స్‌గా చెల్లిస్తుండగా.. ఈసారి దాన్ని రూ.20లక్షలకు పెంచామని ఆయన అన్నారు. అలాగే ఎస్సై నుంచి ఇన్‌స్పెక్టర్‌వరకూ రూ.35 లక్షలను చెల్లించనున్నామని తెలిపారు. డీఎస్పీ ఆపై స్థాయి అధికారులకు రూ. 45 లక్షలను గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కింద చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ గ్రూపు ఇన్సూరెన్స్‌తోపాటు ప్రమాదవశాత్తూ పోలీసులకు ఏదైనా జరిగితే దానికింద చెల్లించే బీమాను గణనీయంగా పెంచామని సీఎం జగన్‌ తెలిపారు. ఎవరైనా పోలీసు సిబ్బంది అసహజ మరణం పొందితే రూ. 30 లక్షలు, తీవ్రవాదులు లేదా ఉగ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోతే రూ. 40 లక్షల రూపాయలను అందిస్తూ విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇందులో  64,719 మంది పోలీసు సిబ్బంది కుటుంబాలకు బీమా భద్రత లభిస్తుందని సీఎం జగన్‌ తెలిపారు. పదవీవిరమణ పొందిన తర్వాత కూడా ఈ పాలసీలు అమలుకానున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతంసవాంగ్, అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ సహా యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

సీఎం జగన్‌ను కలిసిన ఏఎస్పీలు:
2014 నుంచి పెండింగులో ఉన్న ప్రమోషన్లకు అంగీకారం తెలిపి.. పదోన్నతి కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏఎస్పీలు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం  డీఎస్పీల నుంచి ఏఎస్పీలుగా పదోన్నతి పొందిన అధికారులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ను కలిశారు.  ఈ సందర్భంగా ఏఎస్పీలు మీడియాతో మాట్లాడుతూ.. పదోన్నతుల్లో పక్షపాతం లేకుండా అన్ని కేటగిరి అధికారులకు అర్హతల ప్రకారం ప్రమోషన్లు కల్పించారని ముఖ్యమంత్రిలతో వ్యాఖ్యానించామని తెలిపారు. గతంలో కొంత మందికే లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని.. ఈసారి పక్షపాతానికి తావులేకుండా అర్హతలున్న వారందరికీ సమాన స్థాయిలో పదోన్నతులు వచ్చాయని సీఎం తెలిపామన్నారు. ప్రజలకు రక్షణ కల్పించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని కొత్తగా ప్రమోషన్లు పొందిన ఏఎస్పీలు తెలిపారు. ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతంసవాంగ్, అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ పాల్గొన్నారు.

సీఎం జగన్‌కు ధన్యవాదములు: పోలీసు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌
పోలీసుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పోలీసు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి​కి ధన్యవాదాలు తెలిపింది. వారాంతపు సెలవుతో 64 వేలమంది పోలీసు కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందని.. పోలీసుల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, యాక్సిడెంటల్‌ పాలసీ విలువ పెంచి మరింత భరోసా ఇచ్చినందుకు పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు