విద్యుత్‌ రంగంలో పెట్టుబడులే లక్ష్యం

26 Feb, 2020 15:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీ తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు. విద్యుత్‌రంగంపై బుధవారం సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్లాంట్లు పెట్టాలనుకునేవారికి సానుకూల వాతావరణం కల్పించేలా ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు. లీజు ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే ప్రతిపాదనపై ఆయన చర్చించారు. దీనివల్ల భూములిచ్చేవారికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఏటా రైతులకు ఆదాయం వస్తుందని, భూమిపై హక్కులు ఎప్పటికీ వారికే ఉంటాయని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. (మీ చర్యలు స్ఫూర్తిదాయకం)

రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనకు ఎన్టీపీసీ ముందుకు వస్తుందని అధికారులు సీఎం జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. వారికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 10వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణంపై కూడా ఈ సమావేశంలో అధికారులతో సీఎం జగన్‌ చర్చించారు. వీలైనంత త్వరగా సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర విద్యుత్‌ కోసం ఫీడర్ల ఆటోమేషన్‌ ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే రెండేళ్లలోగా ఆటోమేషన్‌ పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. (అవినీతి ఎక్కడున్నా ఏరివేయాలి)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా