పెద్దాసుపత్రిలో పెద్దాయన గురుతులు

8 Jul, 2019 11:19 IST|Sakshi
మాతాశిశు భవనం

కర్నూలు సర్వజన ఆసుపత్రిలో కేథలాబ్‌ ఏర్పాటుకు అడిగిన వెంటనే ఓకే చెప్పిన వైఎస్సార్‌ 

మాతాశిశు సంరక్షణ భవనమూ ఆయన హయాంలోనే 

కర్నూలు(హాస్పిటల్‌): రాయలసీమ ప్రజల వైద్యసేవలకు పెద్దదిక్కుగా ఉన్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆధునిక వైద్యం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ అడిగిన వెంటనే నిర్ణయాలు తీసుకుని ప్రజల ఆరోగ్య పరిరక్షణే అతి ముఖ్యమని నిరూపించారు. ఆసుపత్రిలోని గుండెజబ్బుల విభాగానికి కేథలాబ్‌ యూనిట్‌ ఏర్పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మాతాశిశు సంరక్షణ భవనానికి ఆయన హయాంలోనే బీజం పడింది. ఇప్పుడు ఆ విభాగాలు ఎన్నో వేల మందికి ఊపిరి పోస్తూ సీమ ప్రజల వరప్రదాయినిగా నిలుస్తున్నాయి.    కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగం 30 ఏళ్ల క్రితమే ప్రారంభమైనా అందుకు అనుగుణంగా 15 ఏళ్ల క్రితం వరకు వసతులు, సౌకర్యాలు ఉండేవి కావు. 2005లో ఓసారి  జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఆసుపత్రి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ కలిసి కేథలాబ్‌ యూనిట్‌ కోసం విన్నవించగా  వెంటనే ఆయన ఓకే చేశారు.

రూ.5కోట్లతో 2008 ఆగష్టు 2వ తేదీన అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి గల్లా అరుణకుమారి చేతుల మీదుగా కేథలాబ్‌ యూనిట్‌ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేథలాబ్‌లో 10వేల యాంజియోగ్రామ్‌లు, వెయ్యికి పైగా స్టెంట్లు, 40 దాకా పర్మినెంట్‌ పేస్‌మేకర్లు, 200 దాకా టెంపరరీ పేస్‌మేకర్లు తదితర వైద్యచికిత్సలు నిర్వహించారు. కేథలాబ్‌ యూనిట్‌తో పాటు వచ్చిన హార్ట్‌లంగ్‌ మిషన్‌ ప్రస్తుతం కార్డియోథొరాసిక్‌ విభాగానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ విభాగంలో హెచ్‌ఓడీ, కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సి. ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో 320కు పైగా వివిధ రకాల గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్కువ సమయంలో ఎక్కు వ గుండెశస్త్రచికిత్సలు నిర్వహించిన వారీగా ఆయన రికార్డు నెలకొల్పారు. ఈ రెండు విభాగాలు రాయలసీమ ప్రజలకు వరప్రదాయినిగా నిలిచాయి.

మాతాశిశు వైద్యానికి ఎంసీహెచ్‌ భవనం.. 

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆసుపత్రిలో మాతాశిశు భవనానికి అంకురార్పరణ జరిగింది. పుల్లారెడ్డి స్వీట్స్‌ అధినేత జి. పుల్లారెడ్డి కోటి రూపాయల విరాళంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో మాతాశిశు భవనానికి శ్రీకారం చుట్టారు. ముందుగా ప్రస్తుతం చిన్నపిల్లల విభాగం నిర్వహిస్తున్న భవనం ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రసూతి విభాగ నిర్మాణం పూర్తయింది. ఈ రెండు భవనాలకు మొత్తంగా రూ.35కోట్ల వరకు వెచ్చించారు. దీనివల్ల చిన్నపిల్లలు, గర్భిణీలకు ఇబ్బందులు తప్పాయి. గతంలో చాలీచాలని భవనాల్లో ఒకే పడకపై ఇద్దరేసి రోగులు చికిత్స పొందేవారు. ప్రస్తుతం విశాలమైన గదులు, వార్డులతో ఈ విభాగం ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది.   

మరిన్ని వార్తలు