రూ.కోటి విలువైన స్థలం దానం

26 Apr, 2017 08:41 IST|Sakshi
రూ.కోటి విలువైన స్థలం దానం

స్కూలు భవనాన్ని, స్థలాన్ని రాసిచ్చిన వైనం
వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి కుటుంబ సభ్యుల దాతృత్వం


పులివెందుల రూరల్‌: వైఎస్సార్‌ జిల్లా పులివెందుల పట్టణం అంబకపల్లె రోడ్డులోని పాల్‌రెడ్డి ఎంపీయూపీ స్కూలు భవనాన్ని, స్థలాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి (వైఎస్‌ రాజారెడ్డి సోదరుడు చినకొండారెడ్డి కుమారుడు) సతీమణి వైఎస్‌ పద్మావతి, కుమారుడు వైఎస్‌ మదన్‌మోహన్‌రెడ్డి (వైఎస్‌ మధు) వైఎస్సార్‌ జిల్లా పరిషత్‌కు దానం చేశారు. మంగళవారం ఎంపీడీవో అక్రమ్‌ బాషా, సూపరింటెండెంట్‌ ముకుందారెడ్డిలను కలసి 454/2 సర్వే నంబరులోని 21 సెంట్ల స్థలాన్ని, అందులోని భవనాన్ని జెడ్పీకి దానపత్రం రాసి ఇచ్చారు. దీనివిలువ ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం రూ.కోటికిపైగా ఉంటుంది.

ఇంతటి విలువైన స్థలాన్ని జిల్లా పరిషత్‌కు దానం చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ పద్మావతి, వైఎస్‌ మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్‌ పాల్‌ జగన్‌మోహన్‌రెడ్డి (వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి కుమారుడు) జ్ఞాపకార్థం ఈ భవనాన్ని, స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించినట్లు చెప్పారు. పేదలకు మెరుగైన విద్యనందించాలన్నదే వైఎస్‌ కుటుంబ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఈ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ ఆశయమని చెప్పారు.

మరిన్ని వార్తలు