15న రాజమండ్రి నుంచి వైఎస్ఆర్ సీపీ బస్సుయాత్ర

11 Apr, 2015 13:40 IST|Sakshi
15న రాజమండ్రి నుంచి వైఎస్ఆర్ సీపీ బస్సుయాత్ర

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల15 నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు.  ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  

రాజమండ్రి నుంచి 15వ తేదీ ఉదయం బస్సుయాత్ర ప్రారంభమవుతుందని జ్యోతుల నెహ్రూ వెల్లడించారు.  ఈ యాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, రైతు నాయకులు పాల్గొంటారని జ్యోతుల అన్నారు.  ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎత్తి గట్టడం, రైతు సమస్యలు నేరుగా తెలుసుకోవడమే ఈ బస్సుయాత్ర ఉద్దేశమన్నారు.  పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యత్నిస్తున్నారని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు.

తొలి రోజు ధవళేశ్వరం, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శిస్తామని.. మార్గమధ్యలో రైతులతో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈనెల 16న ఉదయం కృష్ణా బ్యారేజ్ సందర్శన, అక్కడ రైతులతో రచ్చబండ, 17న రాయలసీమలోని వివిధ ప్రాజెక్టులను పరిశీలిస్తామన్నారు. కాగా నగరి ఎమ్మెల్యే రోజా.. దళితులను అవమానించలేదని, ఆమెపై టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జ్యోతుల నెహ్రూ అన్నారు.

మరిన్ని వార్తలు