ఫ్యాన్‌ విజయ దుందుభి

24 May, 2019 06:46 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ హవా

2014లో పోల్చితే భారీగా పెరిగిన సీట్లు 

వైఎస్సార్, నెల్లూరు, కర్నూలు విజయనగరం జిల్లాల్లో అన్ని స్థానాలూ కైవసం 

ఉత్తరాంధ్ర, రాయలసీమలో పూర్తి ఆధిక్యం 

ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టిన ప్రజలు

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బ్రహ్మ రథం పట్టారు. ఇటు ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం మొదలు అటు కర్ణాటక సరిహద్దులోని అనంతపురం వరకూ వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ కకావికల మైంది.  టీడీపీ కంచుకోటలకు బీటలు పారాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి, టీడీపీ లోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్‌ ఒక్కరే గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలిచిన వైఎస్సార్‌ సీపీ ఈ ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. టీడీపీ 20 స్థానాలతోనే సరిపెట్టు కుంది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ 102 స్థానాల్లోనూ, బీజేపీ నాలుగు చోట్ల గెలు పొందగా మరో ఇద్దరు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాల్లో మాత్రమే గెలిచింది. తూర్పు గోదావరి జిల్లా రాజో లులో మాత్రమే జనసేన నెగ్గింది. పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, సినీనటుడు నాగబాబు నర్సాపురం లోక్‌ సభ స్థానంలో ఓటమి పాలయ్యారు. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేసిన పవన్‌ కల్యాణ్‌ ఆ రెండుచోట్లా ఘోర పరాజయం పొందడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పలు జిల్లాల్లో టీడీపీ ఖాతా తెరవలేకపోయింది. అన్ని స్థానాల్లో ఫ్యాన్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. 2014 ఎన్నిక లతో పోల్చితే ఈ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ వైస్సార్‌సీపీ పూర్తి ఆధిక్యత కనబర్చింది. వైఎస్సార్, విజయనగరం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. 

కుప్పంలో తగ్గిన చంద్రబాబు మెజారిటీ 
గత ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలకు గాను 29 స్థానాలను టీడీపీకి కట్టబెట్టారు. పశ్చిమలో ఆ పార్టీ మొత్తం 15 స్థానాలనూ నెగ్గింది. బాబు సాధ్యం కాని హామీలిచ్చి మోసం చేశారని భావించినవారు... ఉప్పెనలా స్పందించి టీడీపీ పునాదులను పెకలించారు. ఈసారి టీడీపీని ఆరు స్థానాలకే పరిమితం చేశారు. బీసీ రిజర్వేషన్‌పై మోసం చేసినందుకు కాపులు చంద్రబాబుకు గట్టి గానే బుద్ధి చెప్పారు. ఇదే సామాజిక వర్గంపై గంపె డాశలు పెట్టుకున్న జనసేనకు చుక్కలు చూపించారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భీమవరంలో పోటీ చేసి బొక్కబోర్లా పడ్డారు. నవరత్నాలు, మహా నేత వైఎస్‌లా మాటపై నిలబడతారనే నమ్మకంతో జగన్‌ వైపే మొగ్గు చూపారు. సంప్రదాయంగా టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచే బీసీలలో బలమైన శెట్టిబలిజ, గౌడ సామాజిక వర్గాలు జగన్‌ ప్రకటించిన ఏలూరు బీసీ డిక్లరేషన్‌తో వైఎస్సార్‌సీపీ వైపు ఆకర్షితుల య్యారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఒక్క సీటు కూడా గెలవని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి 13 సీట్లలో విజయ ఢంకా మోగించింది. పశ్చిమ గోదా వరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభా కర్‌ అసెంబ్లీ చిత్తుగా ఓడిపోయారు.

చింతమనేనిపై 17,459 ఓట్ల తేడాతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి విజయం సాధించారు. రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణపై ఆచం టలో చెరుకువాడ శ్రీరంగనాథరాజు 12,231 ఓట్ల తేడాతో గెలుపొందారు. భీమవరంలో జనసేన అధ్య క్షుడు పవన్‌కల్యాణ్‌పై గ్రంధి శ్రీనివాస్‌ 7,790 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఏలూరు పార్ల మెంట్‌ సభ్యునిగా కోటగిరి శ్రీధర్, నర్సాపురం నుంచి కనుమూరి రఘురామకృష్ణంరాజు గెలుపొం దారు. గత ఎన్నికల్లో 3 సీట్లు మాత్రమే పొందిన విజయనగరం జిల్లాలో ఇప్పుడు ఫ్యాన్‌ మొత్తం 9 సీట్లను కైవసం చేసుకుంది. రాయలసీమలోని నాలు గు జిల్లాల్లో 52 అసెంబ్లీ స్థానాలకు గాను కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హిందూపురంలో నంద మూరి బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్‌ మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. మిగిలిన 49 స్థానా ల్లో వైఎస్సార్‌సీపీ నెగ్గింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో 34 స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ 28 స్థానా లను గెలుచుకుంది.

గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి మొదటిసారి పోటీ చేసిన మంత్రి నారా లోకేశ్‌ ఓటమి పాలయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావుతోపాటు అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కూడా పరాజయం చవిచూశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల నుంచి 2014 ఎన్నికల్లో 75,243 వేల మెజార్టీతో గెలుపొందగా, ఇప్పుడు 90 వేల పైచిలుకు ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. ఆయన మెజారిటీ 15 వేలు పెరిగింది. కుప్పం నుంచి చంద్రబాబు మెజార్టీ గత ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు 17 వేలకు పైగా తగ్గడం గమనార్హం. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ కేవలం కుప్పం స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ జిల్లాలోని పుంగనూరు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 43,555 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 

ఎన్ని కుటుంబాలు ఏకమైనా.. 
కర్నూలు జిల్లాలో సుదీర్ఘ రాజకీయ ప్రాధాన్యం గల పెద్ద కుటుంబాలు ఏకమై టీడీపీ తరఫున పోటీ చేసినా ప్రజలు ఆదరించలేదు. దశాబ్దాలుగా బద్ధ శత్రువుల్లా వేర్వేరు పార్టీల్లో కొనసాగిన కోట్ల, కేఈ కుటుంబాలు గెలవాలనే స్వార్థమే లక్ష్యంగా ఎన్నికల ముందు కలిసిపోయాయి. కాంగ్రెస్సే నా శ్వాస అని చెబుతూ వచ్చి రాజకీయ ప్రత్యర్థి కేఈతో రాజీపడి, టీడీపీలో చేరి, కర్నూలు నుంచి లోక్‌సభకు పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆలూరు నుంచి బరి లోకి దిగిన ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మను ప్రజలు ఓడించారు. అలాగే పత్తిపాడు నుంచి కేఈ తనయుడు శ్యామ్‌కుమార్, డోన్‌ నుంచి కేఈ ప్రతాప్‌ (కేఈ కృష్ణమూర్తి సోదరుడు) ఇద్దరినీ ప్రజలు తిరస్క రించారు. పత్తికొండ నుంచి శ్రీదేవి చేతిలో శ్యామ్‌ కుమార్, డోన్‌లో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతిలో కేఈ ప్రతాప్‌ ఓటమి చవిచూశారు. ఇదే జిల్లాలో వైఎస్సార్‌సీపీ తరఫున విజయం సాధించి.. మంత్రి పదవి కోసం టీడీపీలోకి ఫిరాయించిన అఖిలప్రియ తోపాటు ఆమె సోదరుడినీ ప్రజలు ఓడించారు. 

స్వార్థపు కలయికలను తిరస్కరించిన జనం 
వైఎస్సార్‌ జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయ ప్రత్య ర్థులుగా కొనసాగిన రామసుబ్బారెడ్డి, ఆదినారా యణరెడ్డి రాజకీయ స్వార్థంతో కలిసిపోయి పోటీ చేయడాన్ని ప్రజలు తిరస్కరించారు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాలు రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి కలిసిపోయిన విషయం విదితమే. ఆదినారాయణరెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి, రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు నుంచి  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధీర్‌రెడ్డి చేతిలో 51వేల పైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు.  

సిక్కోలు గడ్డపై విజయ పతాక 
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకట్రావు, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌లను శ్రీకాకుళం ప్రజలు ఇంటికి పంపించారు. మరో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వల్ప మెజార్టీతో ఓటమి తప్పించుకున్నారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో 4,409 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవిపై, తమ్మినేని సీతారాం ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌పై ఆమదాలవల సలో 13,856 ఓట్లతో ఘన విజయం సాధించారు. నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే ధర్మా న కృష్ణదాస్‌ 19,129 ఓట్లతో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై గెలుపొందారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కంబాల జోగు లు, విశ్వాసరాయి కళావతి మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.  టెక్కలిలో నుంచి మరోసారి బరిలోకి దిగిన మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడి పరిస్థితి చివరివరకూ గెలుపు ఓటములతో దోబూచు లాడింది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ ఆయనకు ముచ్చెమటలు పట్టించారు. చివరకు అచ్చెన్న 8,851 ఓట్లతో గట్టెక్కారు.  

విశాఖ జిల్లాలో విజయనాదం 
టీడీపీకి పెట్టని కోటగా భావించే విశాఖ జిల్లాలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయబావుటా ఎగురవేయగా, 3 పార్లమెంటు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే విజయఢంకా మోగించారు. సీనియర్‌ మంత్రి చింత కాయల అయ్యన్నపాత్రుడు ఓటమి పాలవ్వగా, గాజువాక నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్, విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నారు. అరకు లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి, ఐదు పర్యాయాలు ఎంపీగా చేసిన కిషోర్‌ చంద్రదేవ్‌రాజుపై సాధారణ టీచర్‌గా పనిచేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి గొట్టేటి మాధవి రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేశారు. గాజువాకలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి జనసేన అభ్యర్థి పవన్‌కల్యాణ్‌పై 16,774 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.   

కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌సీపీ హవా 
ఆవిర్భావం నుంచి టీడీపీ పట్టుగొమ్మగా ఉన్న కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. 16 అసెంబ్లీ స్థానాలకు గాను 14 చోట్ల వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఓటమి పాల య్యారు. ఆయనపై 5,852 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేర్ని నాని ఘనవిజయం సాధించారు. మైలవరంలో మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓడిపోయారు. 

టీడీపీ కంచుకోటలకు బీటలు 
జన ప్రభంజనంలో పచ్చపార్టీ కంచుకోటలకు బీటలు వారాయి. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ సీట్లకు గాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 15 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లను కైవసం చేసుకుంది. టీడీపీకి 2 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్‌ స్థానం మాత్రమే దక్కింది. మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, నారా లోకేష్, మాజీ మంత్రి ఆలపాటి రాజా,  స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, సీనియర్‌ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు. మంగళగిరి శాసనసభ స్థానానికి బరిలో నిలిచిన మంత్రి నారా లోకేశ్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి  (ఆర్కే) చేతుల్లో ఓటమి పాలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విజయనగరంలో చరిత్ర సృష్టించిన ఫ్యాన్‌ 
విజయనగరం జిల్లాలో వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. జిల్లాలోని మొత్తం లోక్‌సభ, అసెంబ్లీ సీట్లులో గెలుపొందింది. ఫ్యాన్‌ సునామీలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టుకుపోయారు. విజయనగరం జిల్లాలో మొత్తం విజయనగరం లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటితోపాటు అరుకు, విశాఖపట్నం లోక్‌సభ స్థానాలు పరిధి కూడా నాలుగు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. అన్ని సీట్లలోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి బెల్లాన చంద్రశేఖర్‌ భారీ మోజార్టీతో విజయం సాధించారు. ఈయనపై పోటీ చేసిన తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి, కేంద్రమాజీ మంత్రి పూసపాటి ఆశోక్‌గజపతిరాజు ఓటమి పాలయ్యారు.

మరిన్ని వార్తలు