బీసీలకు అండ.. జగనన్న ఎజెండా

16 Feb, 2019 14:05 IST|Sakshi
ఏలూరులో బీసీ గర్జన మహాసభ వేదిక నిర్మాణ పనులు 

ఏలూరు టౌన్‌: బీసీ సామాజికవర్గాల సమస్యలను అధ్యయనం చేసి.. వారి అభ్యున్నతికి స్పష్టమైన హామీలు ఇవ్వటంతోపాటు బీసీల జీవన ప్రమాణాల మెరుగుదలకు తాము అధికారంలోకి వస్తే ఏమి చేయబోతామో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించనున్నారు. సమాజంలో 52 శాతంగా ఉన్న బీసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించనుంది. కొంత కాలంగా టీడీపీకి కొమ్ముకాస్తూ వస్తున్న బీసీలను ఆ పార్టీ ప్రభుత్వం విస్మరించిందనే అపవాదు మూటగట్టుకున్న నేపథ్యంలో బీసీలకు భరోసా కల్పిం చాలని,  వారికి అండగా ఉండాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఓట్ల యంత్రాలుగా మాత్రమే తమను చూస్తున్నారు తప్ప, తమకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వటం లేదనే తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్న బీసీలను అక్కున చేర్చుకునేందుకు 

ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. 
ఏర్పాట్లు ముమ్మరం : ఏలూరు నగరంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బీసీ సామాజికవర్గాల ప్రజలతో భారీఎత్తున బీసీ గర్జన మహాసభను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఈనెల 17న మధ్యాహ్నం ఒంటిగంట నుంచి బీసీ గర్జన సభను ప్రారంభించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరులోని సర్‌ సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలోని హేలాపురి సిటీ పక్కనే బీసీ గర్జన మహాసభ ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ ప్రాంగణానికి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణంగా నామకరణం చేశారు. గర్జన సభ వేదిక నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏర్పాట్లు, బీసీ వర్గాల తరలింపు, సదుపాయాలు, ట్రాఫిక్‌ తదితర అంశాలపై ఇప్పటికే పార్టీ ఉభయగోదావరి జిల్లాల కో–ఆర్డినేటర్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  పర్యవేక్షిస్తుండగా, వేదిక నిర్మాణం, సభాస్థలంలో ఏర్పాట్లను  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం స్వయంగా పరిశీలిస్తున్నారు. ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అ«ధ్యక్షుడు కవురు శ్రీనివాస్, ఇతర పార్టీ నేతలు, బీసీ గర్జన సభ ఇన్‌చార్జ్‌లు నియోజకవర్గాలు, గ్రామాల్లో పర్యటిస్తూ బీసీ గర్జనపై ప్రజలకు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. 

బీసీ డిక్లరేషన్‌ ప్రకటించనున్న వైఎస్‌ జగన్‌ 
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజికవర్గాల ప్రజల సమస్యలపై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ అధ్యయన కమిటీని నియమించారు. బీసీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి కమిటీ చైర్మన్‌గా రాష్ట్రంలోని బీసీల్లోని 164 కులాల నేతలు, సంఘాలు, ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అధ్యయన కమిటీ నివేదికతోపాటు, ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ స్వయంగా బీసీ ప్రజల కష్టాలను తెలుసుకుని వాటి ఆ«ధారంగా బీసీ డిక్లరేషన్‌ ప్రకటించనున్నారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచార నగారా మోగిస్తారు  
త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఏలూరు నుంచే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార నగారా మోగించనున్నారు. ఇప్పటికే తిరుపతి, అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లో పార్టీ శ్రేణులతో సమరశంఖారావాన్ని పూరించిన వైఎస్‌ జగన్‌.. ఏలూరు నుంచే ప్రచారపర్వానికి శ్రీకారం చుడతారని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఏలూరులో జరిగే బీసీ గర్జన మహాసభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీ గర్జన సభలో వైఎస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు