'ఎమ్మెల్యేపై దాడి సీఎం కార్యాలయమే ప్రోత్సహిస్తోంది'

13 Jul, 2014 14:04 IST|Sakshi
'ఎమ్మెల్యేపై దాడి సీఎం కార్యాలయమే ప్రోత్సహిస్తోంది'

గుంటూరు నగర తూర్పు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముస్తాఫాపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై దాడి వ్యవహరంలో జోక్యం చేసుకోవాలని ధర్మాన ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం శ్రీకాకుళంలో ధర్మాన మాట్లాడుతూ... స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, దౌర్జన్యాలు వ్యూహత్మక నేరమని ఆయన ఆభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయం ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు.



ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నాయకుడు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా ఎంపీటీసీ సభ్యులతో కలసి వాహనాలలో బయలుదేరారు. ఆ వాహనాలు మేడికొండూరు సమీపంలోనికి రాగానే వారిపై దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడికి చేశారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ నాయకుల వాహనాలలో ఉన్న ముగ్గురు ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో వైఎస్ఆర్ సీపీ నాయకుల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే ముస్తాఫాకు స్వల్పంగా గాయపడ్డారు.

మరిన్ని వార్తలు