రైతులను ఆదుకున్నది వైఎస్ ఒక్కరే

11 Apr, 2014 04:18 IST|Sakshi

భీమవరం, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని రైతులను అన్ని విధాలా ఆదుకున్నది దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. గురువారం ఆయన  భీమవరంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రుణమాఫీ చేసి రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. జలయజ్ఞం, డెల్టా ఆధునికీకరణ వంటి పనులకు శ్రీకారం చుట్టి రైతుల గుండెల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచారని చెప్పారు.
 
ప్రాంతాలకతీతంగా రైతులకు అండగా నిలిచి వారి కష్టాలు, బాధల ను తీర్చారన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉండుంటే ఆయన చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేదన్నారు. రాష్ట్రంలో తిరిగి రైతు రాజ్యం రావాలంటే వైఎస్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్సార్ సీపీ స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నట్టు ముదునూరి చెప్పారు.
 
టీడీపీ పాలనలో చంద్రబాబు వ్యవసాయాన్ని దండగగా చేశారని, అన్నదాతలను అన్ని విధాలా నట్టేట ముంచారని విమర్శించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని వైఎస్ ప్రవేశపెడితే కరెంట్ తీగలపై దుస్తులు ఆరేసుకుంటామంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబే వైఎస్ అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని చూసి తాను కూడా ఇస్తానంటూ హామీ ఇవ్వడం ప్రజలు గమనించాలని కోరారు. రైతులను అన్నివిధాలా దగా చేసిన చంద్రబాబు నేడు ఓట్ల కోసం ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు.
 
మన ప్రాంతానికి ఎంతో అవసరమైన పోలవరం ప్రాజెక్టును టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చకపోవటంతో ఆయన నిజస్వరూపం తేటతెల్లమవుతుందన్నారు. రైతులు, రైతు కూలీల పట్ల చంద్రబాబుకు ఏమాత్రం విశ్వాసం లేదన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాలని ముదునూరి ప్రసాదరాజు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు