కరోనా నివారణ.. అందరి బాధ్యత

27 Mar, 2020 12:08 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరి కిరణ్‌

నిత్యావసర సరుకుల కొనుగోలులో సామాజిక దూరం పాటించాలి

గూడ్స్‌ వెహికల్స్‌ను అడ్డుకోరు

రైతుల ఉత్పత్తులు లోకల్‌ మార్కెట్‌కు తీసుకురావచ్చు

రెస్టారెంట్లకు వెళ్లొద్దు.. డోర్‌ డెలివరీ చేసుకోండి

జిల్లాకు ఇతర దేశాల నుంచి 3917 మంది వచ్చారు

ఏప్రిల్‌  14 వరకు అమలులో 144 సెక్షన్‌ కలెక్టర్‌ సి.హరి కిరణ్‌

సాక్షి కడప : కరోనా వైరస్‌ నివారణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలి. ఇది మనందరి బాధ్యతగా ఫీలవ్వాలి. అత్యవసరమైతే తప్ప బయటికి రాకపోవడమే  మంచిది. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు బాగా లేవు. విదేశాల నుంచి వచ్చిన వారు, లేక ఇతర కారణాలతోనో కరోనా వైరస్‌ వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ సి.హరి కిరణ్‌ సూచించారు.   గురువారం కడప కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జాయింట్‌ కలెక్టర్లు గౌతమి, శివారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఏప్రిల్‌ 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌  పాటించాల్సిందేనని అన్నారు. ఇప్పటికే పీఎం మోదీ, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కరోనా లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారని.. ప్రజలందరూ పాటించాల్సిన బాధ్యత ఉందన్నారు. మన ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటిస్తూ  శానిటైజర్లు వినియోగించాలని ఆయన  కోరారు.

ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటికి రావాలి
ప్రతిరోజు నిత్యావసర వస్తువులు, కూరగాయలకు సంబంధించి సంచులు  పట్టుకుని ఇంటిలో నుంచి ఇద్దరు, ముగ్గురు కాకుండా కేవలం ఒకరు మాత్రమే టూ వీలర్, కాలినడకన వచ్చి కొనుగోలు చేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. అది కూడా సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ముందుగా ఉదయం 6.00 నుంచి 10.00 గంటల వరకు ఉన్న సమయాన్ని కూడా జనం రద్దీ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యా హ్నం 1.00 గంట వరకు పెంచామన్నారు. షాపుల యజమానులు సామాజిక దూరం పాటించకపోతే దుకాణాలను సీజ్‌ చేస్తామన్నారు. మైదానాల్లో ఏర్పాటు చేసే షాపుల్లో  సామాజిక దూరం ఉండేలా ముగ్గులు వేయించామన్నారు.మందుల దుకాణాలు, ఆస్పత్రులు మాత్రం 24 గంటలు పనిచేస్తాయన్నారు. మధ్యాహ్నం 1.00 గంట తర్వాత జనాలు రోడ్డుపై కనిపించడం మంచిది కాదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయట కనిపించరాదన్నారు.

ఏప్రిల్‌ 14 వరకు 144 సెక్షన్‌ అమలు
ఎక్కడా కూడా గుంపులుగా జనాలు ఉండకూడదని.. అలా ఉన్నట్లయితే కేసులు నమోదు చేస్తా మని కలెక్టర్‌ హెచ్చరించారు. బైకుల్లో కూడా ఒక్కరు మాత్రమే వెళ్లాలన్నారు. జిల్లాలో ఏప్రిల్‌ 14 వరకు 144 సెక్షన్‌ అమల్లో  ఉంటుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ గృహాలకే పరిమితమవుతూ స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు. మసీదు, చర్చి, దేవాలయాలకుసంబంధించి అక్కడి పూజారులు దూప దీప నైవేద్య కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు.  శ్రీరామ నవమి సందర్భంగా ఇళ్లలోనే పూజలు  నిర్వహించుకోవాలన్నారు. ఉగాది పండుగ తరహాలోనే జరుపుకోవాలి.. పానకం, వడపప్పు అంటూ బజార్లలో ఎలాంటి కార్యక్రమాలు జరపరాదన్నారు.  దేశ నాయకుల వర్దంతులు, జయంతులు కూడా ఇంటిలోనే చిత్రపటాలు పెట్టుకుని నిర్వహించాలన్నారు. విగ్రహాల వద్దకు వెళ్లరాదని సూచించారు.

గూడ్స్‌ వెహికల్స్‌ను ఎవరూ అడ్డుకోరు
జిల్లాలో రైతు బజార్, మార్కెట్లకు సరుకులతో వచ్చే  రైతుల  వాహనాలు, ఇతర గూడ్స్‌ వాహనాలను ఎవరూ అడ్డుకోరని కలెక్టర్‌ హరికిరణ్‌ తెలియజేశారు. రైతులు పండించిన కూరగాయలు లోకల్‌ మార్కెట్‌కు తీసుకు రావచ్చని సూచించారు. అయితే అరటి, మామిడి   ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. అరటికి సంబం«ధించి ఐదారు లక్షల టన్నుల కాయలున్నట్లు ప్రభుత్వానికి తెలియజేశామని, త్వరలోనే ఒక నిర్ణయం వెలువడవచ్చని చెప్పారు. లోకల్‌గా ఉండే షాపింగ్‌ మాల్స్‌లో సరుకు తెప్పించుకుంటామంటే అందుకు అవసరమైన గోడౌన్లను కూడా ఏర్పాటు చేయిస్తామని వివరించారు.

విదేశాల నుంచి జిల్లాకు 3917 మంది
వివిధ దేశాల్లో ఉపాధి నిమిత్తం ఉన్న వేలాది మంది జిల్లా వాసుల్లో   3917 మంది ఇటీవల కరోనా వైరస్‌ నేపథ్యంలో జిల్లాకు వచ్చారని.. వారిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌లో కొందరిని, స్వీయ నిర్బంధంలో మరికొందరిని ఉంచినట్లు కలెక్టర్‌  తెలియజేశారు. 28 రోజులు పూర్తయిన వారు 300 మంది ఉన్నారని తెలిపారు. 28 రోజులు పూర్తి కాని వారు దాదాపు 3,600 మంది ఉన్నారని.. 14 రోజులు పూర్తి కాని వారు 1,700మంది ఉన్నట్లు వెల్లడించారు. ఎప్పటికప్పుడు వారికి వైద్య సేవలు అందిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి రాగానే నేరుగా క్వారంటైన్లకు తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కామన్‌ క్వారంటైన్లను ప్రారంభించినట్లు వివరించారు. రాష్ట్ర స్థాయిలో కోవిడ్‌కు సంబంధించి అనుమానిత కేసుల విషయంలో టోల్‌ ›ఫ్రీ నంబరు 104కు, జిల్లాలో అయితే 08562–245259, 08562–259179 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వొచ్చన్నారు. విదేశాల నుంచి వచ్చేవారు కుటుంబ సభ్యులను కూడా కలువవద్దని తెలిపారు.జిల్లా కేంద్రమైన కడపతోపాటు ఇతర ప్రధాన ప్రాంతాల నుంచి ఆహార పదార్థాలను రెస్టారెంట్లకు వెళ్లకుండా డోర్‌ డెలివరీ ద్వారా తెప్పించుకోవాలని కలెక్టర్‌ కోరారు.  

ఫీవర్లపై సర్వే
జిల్లాలో సచివాలయాల పరిధిలో ఫీవర్స్‌పై సర్వే చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలియజేశారు. రెండు రోజులుగా సర్వే కొనసాగుతోందని తెలిపారు. వలంటీర్లు ఇంటింటికి వెళ్లి జలుబు, దగ్గు ఉన్న వారి వివరాలు సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా సమాచారాన్ని పంపుతున్నారని అన్నారు. జిల్లాలో 74 పీహెచ్‌సీలు ఉండగా వాటి పరిధిలో వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ఉన్న నేపథ్యంలో ఫీవర్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.

బయోమెట్రిక్‌ లేకుండా పెన్షన్లు
జిల్లాలో మార్చి నెలకు సంబంధించి ఏప్రిల్‌లో అందించే పెన్షన్ల విషయంలో బయో మెట్రిక్‌ లేకుండానే పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు. కోల్డ్‌ స్టోరేజీలు, రైస్‌ మిల్లులు, హోటళ్లు, ట్రెజరీ, ట్రాన్స్‌కో, బ్యాంకు, ఏటీఎం సిబ్బంది, గూడ్స్‌ వెహికల్స్, మున్సిపాలిటీ సిబ్బంది, జైలుశాఖ సిబ్బంది, మీడియాకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో రఘునాథ్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఉమా సుందరి, సీపీఓ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు