దీర్ఘాయుష్మాన్‌భవ

27 Oct, 2018 14:20 IST|Sakshi
వెంకటేశ్వరస్వామి గుడిలో పూజలు చేస్తున్న నాయకులు

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం కుదుటపడికోలుకోవాలని కోరుతూ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించాయి. ఈగలు, చీమలు కూడా దూరని ఎయిర్‌పోర్టులోనే ప్రతిపక్ష
నేతకు భద్రత కరువైందని....హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా రాష్ట్రప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతుండడంపై పలుచోట్ల దిష్టిబొమ్మలు దహనం చేశారు. రెండు రోజులుగా జిల్లాలో నిరసన ప్రదర్శనలుచేస్తూనే మరోప్రక్క ప్రతిపక్ష నేత కోలుకోవాలని దేవుళ్లకు మొక్కుతున్నారు.

సాక్షి కడప : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గాయం నుంచి కోలుకోవాలని...దేవుడి ఆశీర్వాదంతో వెంటనే ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించేలా దీవించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి అగస్తేశ్వరస్వామి ఆలయం (శివాలయం)లో  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  కల్లూరులో వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని చౌడేశ్వరీ అమ్మవారికి పూజలు చేసి 108 టెంకాయలు కొట్టారు. ప్రొద్దుటూరు పట్టణంలోని చౌడేశ్వరీ ఆలయంలో  పార్టీ నేత లక్కిరెడ్డి పవన్‌రెడ్డి 108 టెంకాయలు కొట్టారు. హజరత్‌ సౌషన్‌ వల్లీ దర్గాలో ముస్లిం మైనార్టీ నాయకులు ప్రార్థనలు చేపట్టారు.

పులివెందులలో వైఎస్‌ అభిషేక్‌రెడ్డి ఆధ్వర్యంలో ..
పులివెందులలో పార్టీ శ్రేణులు వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ  ప్రార్థనలు నిర్వహించారు.  శివాలయంలో వైఎస్సార్‌ సీపీ డాక్టర్స్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి వైఎస్‌ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. మసీదు, చర్చిలలో కూడా ప్రార్థనలు నిర్వహించారు.

కడప చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ  కడపలోని పాత రిమ్స్‌ వద్ద ఉన్న కాంగి గేషనల్‌ చర్చిలో నాయకులు ప్రార్థనలు నిర్వహించారు.  కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యే సోదరుడు ఎస్‌బీ అహ్మద్‌బాషా, పార్టీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు. దేవునికడపలో పార్టీ మహిళా నాయకురాలు వెంకట సుబ్బమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పెద్దదర్గాలో మైనార్టీ సెల్‌ నగర అధ్యక్షుడు షఫీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు దేవిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 

జమ్మలమడుగు పట్టణంలోని జ్ఞాన లింగేశ్వరస్వామి ఆలయంలో సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజంపేట పరిధిలోని మన్నూరులో ఉన్న ఎల్లమ్మ దేవాలయంలో పార్టీ నియోజకవర్గ నాయకుడు ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో 108 టెంకాయలు కొట్టారు. రాయచోటిలోని దివాన్‌ సాహెబ్‌ దర్గాలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాయచోటిలోని దర్గాలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నసీబున్‌ఖానమ్‌ , శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్‌ నేతృత్వంలో ప్రార్థనలు చేశారు.  కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లెలో ఆంజనేయస్వామి ఆలయంలో పార్టీ శ్రేణులు 180 టెంకాయలు కొట్టారు. బ్రహ్మంగారిమఠం మండలం లిం గాలదిన్నెలో పార్టీ నాయకులు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి పూజలు చేశారు. బద్వేలులోని నెల్లూరు రోడ్డులో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు గురుమోహన్, సుందరామిరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి నేతృత్వంలో టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు