కన్నీటి స్మృతిలో..!

2 Sep, 2019 08:47 IST|Sakshi

మహానేత వైఎస్సార్‌ గతించి నేటికి పదేళ్లు

ఆ మహా విషాదాన్ని మరిచిపోలేని సిక్కోలు

సాక్షి, అరసవల్లి: ‘‘నేను ఏ గ్రామానికి వస్తున్నానో ముందే చెబితే అక్కడి అధికారులు లోపాలు సరిచేసి జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో పర్యటన రోజు ఉదయం కొద్ది గంటల ముందు మాత్రమే నేను వెళ్లే గ్రామం పేరు తెలియజేస్తా. ఆయా గ్రామాల్లో సమస్యలను ప్రత్యక్షంగా చూసి, ఆయా ప్రజలతో నేరుగా సమావేశమవుతా.. వారి సమస్యలు, వారి గుండె చప్పుళ్లు వినేందుకే నే వెళ్తున్నా’’.
-2009 సెప్టెంబరు 2న ఉదయం ‘రచ్చబండ’ కార్యక్రమం కోసం హైదరాబాద్‌లో హెలికాప్టర్‌ ఎక్కేముందు మీడియాతో సీఎం రాజశేఖరరెడ్డి అన్న మాటలివి..

అదే రోజు ఉదయం 7.20 గంటలకు బయలుదేరిన హెలికాప్టర్‌ ఉదయం 10.45 గంటలైనా...గమ్యం చేరాల్సిన చిత్తూరు జిల్లాకు చేరకపోవడంతో రాష్ట్రమంతా ఉత్కంఠ మొదలైంది. టీవీల్లో ప్లాష్‌..ప్లాష్‌గా సీఎం హెలీకాప్టర్‌ అదృశ్యమంటూ కథనాలు...దీంతో రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవమైన వైఎస్‌ఆర్‌ ఎలా ఉన్నారో... క్షేమంగానే ఉన్నారో లేదోనన్న...ఆందోళనల మధ్య జనం కొట్టుమిట్టాడుతున్నారు. వైఎస్‌ రాకకోసం మొక్కని దేవుడు లేడు. జిల్లాలో ప్రతి కాంగ్రెస్‌ నాయకుడు కాదు..కాదు  మనసున్న మనిషి కూడా సర్వమత ప్రార్థనలు చేశారు. తమకు ఏం కావాలో అడగక్కుండా ఇచ్చిన దేవుడిగా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ కారణంతోనే ప్రజలంతా తమ ఇంట్లో సభ్యునికంటే ఎక్కువగా వైఎస్‌ను అభిమానించారు. ఆ అభిమాన వంతుడు, చిరునవ్వుల దేవుడైన వైఎస్‌ఆర్‌... హెలీకాప్టర్‌ ఆచూకీ కోసం కోట్లాది మంది జనం టీవీలకు అతుక్కుపోయారు. రాష్ట్రమంతటా అప్రకటిత ఖర్ఫ్యూ కనిపించింది. కోట్లాది మంది జనం గగ్గోలును, ఆర్తనాదాలను ఆ భగవంతుడు వినకుండా, ఈ భువిలో దేవుడిని దివిలోకి తీసుకుపోయాడు. దీంతో వందలాది మంది గుండె పగిలి ప్రాణాలొదిలారు. మరికొందరు నేటికీ సరిగ్గా కోల్కోలేకపోయారు. రాజన్నతో సన్నిహితంగా ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు ఆనాటి విషాదాన్ని నేటికీ మర్చిపోలేకపోతున్నారు. 

తట్టుకోలేకపోయాను..
పదేళ్ల క్రితం..ఇదే రోజు సీఎం వైఎస్సార్‌ హెలికా ఫ్టర్‌ ఆచూకీ తెలియ డం లేదన్న వార్త విన్నప్పుడు ఏంజరిగిందో అని ఆందోళ న చెంది తట్టుకోలేకపోయాను. టీవీలో ఎప్పటికప్పుడు సమాచారం చూస్తూనే.. రాజధాని నుంచి కూడా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశాను. నియోజకవర్గ ప్రజలతో పాటు నాభార్య పద్మప్రియ, పిల్లలందరిలోనూ ఒకటే ఉత్కంఠ..రాజన్న తిరిగిరా వాలని కోరుకున్నాం. వినకూడని వార్త వినాల్సి వచ్చింది. నన్ను ఎమ్మెల్యేని చేసిన ఆయన్ను నిత్యం తలచుకుంటాను.
– నాటి ఎమ్మెల్యే, నేటి మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

నిజమైన నాయకుడు..
నా రాజకీయ జీవితంలో ఎందరో నేతలను చూశాను. అందరిలోనూ నాకు రాజశేఖరరెడ్డి అంటే అంతులేని అభిమానం. ఇప్పటికీ ఆయన లేరని తెలిస్తే..లోలోపల దుఃఖం వచ్చేస్తుంటుంది. ఆరోజు ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ ఆచూకీ సిగ్నల్స్‌కు దొరకడం లేదనగానే భయం వేసింది. అయితే ఎక్కడో ఆశ...మా రాజన్న వచ్చేస్తారులే అనుకున్నాం.. కానీ అంతటి దారుణం జరుగుతుందని ఊహించనేలేదు...  అలాంటి ప్రజా నాయకుడు కోట్లలో ఒకడే పుడతారు. 
– నాటి మంత్రి, నేటి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు

ఏడ్చేశాను...
నాకు రాజకీయ ఓనమాలు నేర్పిన నా తండ్రి సమానులు దివంగత వైఎస్సార్‌. ఇదే రోజున ఆయన ప్రమాదవశాత్తు మరణించారని టీవీల్లో చూశాను. తండ్రి పోయిన బాధ కలిగింది. ఏడ్చేశాను. పాదయాత్రలో ఆయనతో కలిసి నడిచినప్పుడు.. నాయకుడు అంటే ఇలా ఉండాలి అనేంత స్ఫూర్తినిచ్చారు. శీనూ.. అని నోరారా పిలిచిన ఆ పిలుపు దూరమై పదేళ్లు దాటింది. నన్ను నా కుటుంబాన్ని సొంత కుటుంబసభ్యులుగా చూసిన ఆయన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మరిచిపోను.      
 – దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్‌ సీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త

ప్రతి వర్ధంతికి పిండ ప్రదానం..
వైఎస్సార్‌ అంటే ఎనలేని అభిమానం నాకు. ఆయన చనిపోయారని చెబుతుంటే.. నిజం కాకూడదని దేవుళ్లకు మొక్కుకున్నాను. అయినప్పటికీ అదే నిజమైంది. ఆయన దూరమయ్యారు. పిడుగులాంటి ఈ వార్త విని ఎంతోమంది సొమ్మసిల్లిపోయారు. మా మండలంలో ఒకరు గుండెపోటుతో చనిపోయారు. నాటి నుంచి ప్రతి వైఎస్సార్‌ వర్ధంతికి నా ఇంట్లోనే పిండ ప్రదానం చేసి, అన్నదాన కార్యక్రమం చేస్తుంటాను. నిజంగా ఆయన ప్రజల కష్టాలు తెలుసుకుని తీర్చే దేవుడు.
 – సత్తారు వేణుగోపాలరావు, జయకృష్ణాపురం, టెక్కలి

ప్రతి ఇంటా రోదనలే..
రాజన్న ప్రయాణిస్తున్న విమానం కనిపించడం లేదని తెలియడంతో అందరం కంటతడిపెట్టాం. క్షేమంగా బయట పడాలని అన్ని దేవుళ్లను మొక్కుకున్నాం. ఆ రాత్రి ఎలా గడిచిందో తెలియదు. ఇప్పటికీ టీవీల్లో దృశ్యాలు గుర్తు ఉండిపోయాయి. మా ఊరు రామాలయం, వేంకటేశ్వర స్వామి ఆలయాలు వైఎస్సార్‌ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. రాజకీయాలకు అతీతంగా  పూజలు చేశారు. ఆయన మరణించారనే వార్తను జీర్ణించుకోలేకపోయాం. 
– తాళాసు ప్రదీప్‌కుమార్, అభిమాని, వ్యాపార వేత్త, పలాస

అపర భగీరథుడు రాజన్న!
ఆమదాలవలస రూరల్‌: సిక్కోలు జిల్లాకు పాదయాత్రకు వచ్చినప్పుడు జిల్లా రైతులు పడుతున్న కష్టాలను చూసి ఆనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలించిపోయారు. అన్నపూర్ణగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలో సాగునీరు అందకపోవడంతో పంటలు పండటం లేదనే విషయాన్ని రైతులు నుంచి తెలుసుకున్నారు. అప్పుడే రైతులకు భరోసా ఇచ్చారు.. మంచి రోజులు వస్తాయి.. రైతన్న కల నెరవేరుతుందని చెప్పారు. ఆయన అన్నట్లుగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత వంశధార కుడికాలువకు అనుసంధానంగా అక్విడెక్ట్‌ను నిర్మించి వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేశారు. 2007లో ఆమదాలవలస మండలం తాండ్రసిమెట్ట వద్ద వంశధార కుడి ప్రధాన కాలువకు అనుసంధానంగా అక్విడెక్ట్‌ (వయోడెక్ట్‌)ను ప్రారంభించారు. ఈ సాగునీటి కాలువ నిర్మాణం లేక ముందు రెండు మండలాల్లో పంటపొలాలకు సాగునీరు అందక బీడు భూములుగా ఉండేవి. వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ పాలనలో సుమారు రూ.10 కోట్ల  వ్యయంతో వంశధార కుడి ప్రధాన కాలువకు అనుసంధానంగా అక్విడెక్ట్‌ నిర్మించారు. దీనివల్ల ఆమదాలవలస, శ్రీకాకుళం మండలాల్లో 32 వేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. ఈ అక్వాడెక్ట్‌ నిర్మాణం కూడా ఆసియా ఖండంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతంలోనే నిర్మించడం విశేషం.

సిరులు కురిపిస్తున్న ఎత్తిపోతల పథకాలు..
జలుమూరు: తిండిగింజలు సైతం పండించుకోలేని తరుణంలో కుటుంబ అవసరాలకు సరిపడా ధాన్యం పండించి తిరిగి మార్కెట్‌లో మంచి ధరలకు అమ్ముకునే స్థితికి చేరుకునేలా ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసిన మహానాయకుడు వైఎస్సార్‌ అని జలుమూరు, సారవకోట, నరసన్నపేట రైతులు సగర్వంగా చెబుతుంటారు. 2006 ఫిబ్రవరి 9న సుమారు రూ.13 కోట్ల వ్యయంతో రాణా–లింగాలవలస, జలుమూరు, రామచంద్రపురం, వకోట మండలం తొగిరి  గ్రామాల వద్ద శంకుస్థాపనలు చేసి, 2007–08లో దిగ్విజయంగా నాలుగు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. నరస్నపేటలో రూ.మూడు కోట్లతో జమ్ము వద్ద, పోలాకి మండలంలో మరో రెండు చోట్ల పథకాలు ప్రారంబించారు. వీటిని కొన్ని మరమ్మతులకు గురయ్యాయని, వాటిని వినియోగంలోకి తీసుకొస్తే సుమారు తొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులు చెబుతున్నారు. ఇటీవల మంత్రి కృష్ణదాస్‌ కూడా వీటిపై దృష్టిపెట్టి అధికారులను వెంటబెట్టుకొని ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా