హోదా కోసం ముందడుగు

4 Mar, 2018 12:29 IST|Sakshi

 ఢిల్లీ బాట పట్టిన వైఎస్సార్‌సీపీ

 దేశరాజధానికి ఉద్యమ సెగ

 జిల్లా నుంచి తరలివెళ్లిన నేతలు

 ప్రత్యేక రైళ్లలో పయనం

 రేపు జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మొదటి నుంచీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడా ఉద్యమం తీవ్రతరమైంది.  మొన్న కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. సోమవారం ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేపట్టనున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరుకు జిల్లాలో వివిధ వర్గాలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. మరోపక్క కాంగ్రెస్‌.. వామపక్షాలు కూడా దీనిపై గళం విప్పుతున్నాయి.

సాక్షి, తిరుపతి : ప్రత్యేక హోదా ఉద్యమంలో మలిపోరుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కదిలింది. జాతీయస్థాయికి ఏపీ ప్రజల ఆకాంక్షను, సమర నినాదాన్ని వినిపించేందుకు పార్టీ శ్రేణులు ఢిల్లీ బాటపట్టాయి. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునందుకుని సమరోత్సాహంతో ముందుకు అడుగేశాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నారాయణస్వామి, దేశాయ్‌తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సునీల్‌కుమార్, నియోజకవర్గ సమన్వయకర్తలు జంగాలపల్లి శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చంద్రమౌళి, ఆదిమూలం, బీరేంద్రవర్మ తదితరులు ఢిల్లీకి పయనమయ్యారు.

 ప్రతి నియోజకవర్గం నుంచి 25 నుంచి 30 మంది చొప్పున ఢిల్లీకి వెళ్లారు. వీరిలో కొందరు శుక్రవారం విజయవాడ నుంచి రైల్లో వెళితే... ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కొందరు శనివారం విజయవాడ నుంచి విమానంలో పయనమయ్యారు. మదనపల్లె్ల ఎమ్మెల్యే దేశాయ్‌తిప్పారెడ్డి, పలమనేరు నుంచి రాకేష్‌రెడ్డి బెంగళూరు నుంచి విమానంలో వెళ్లారు. జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు ప్రకాశం జిల్లా నుంచి, ఇంకొందరు తిరుపతి, చిత్తూరు నుంచి రైలు మార్గాన  250 మంది వరకు పయనమయ్యారు.  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరెడ్డి ఆదివారం రేణిగుంట నుంచి విమానంలో ఢిళ్లీకి వెళ్లనున్నారు.

మరిన్ని వార్తలు