మాయమాటలతో మోసగించడమేనా!

28 Dec, 2018 06:55 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కళావతి

ఏం ఉద్దరించారని     మళ్లీ  ‘జన్మభూమి’     నిర్వహిస్తున్నారు

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి

శ్రీకాకుళం , వీరఘట్టం: జన్మభూమి–మాఊరు గ్రామసభల ద్వారా మరోసారి మాయమాటలతో ప్రజలను మోసగించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. స్వగ్రామం వండువలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గత ఐదు విడతల్లో చేపట్టిన జన్మభూమి–మాఊరు గ్రామ సభల్లో ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయలేదని అన్నారు. టీడీపీ ప్రచారం కోసం ప్రజాధనం వృథా చేస్తోందన్నారు.

జన్మభూమి కార్యక్రమం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో జన్మభూమి కమిటీలు పక్షపాత ధోరణిలో పచ్చ చొక్కాలకే కట్టబెడుతున్నాయని మండిపడ్డారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందజేయడంలో అధికార యంత్రాంగం కూడా విఫలమైందని, పూర్తిగా పచ్చచొక్కాలకే దాసోహమంటూ ఊడిగం చేయడం భావ్యంకాదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి పథకంలో ఇంటింటా సర్వే చేస్తున్నామని కల్లబొల్లి మాటలు చెప్పి ఇంటిలోనే ఉండి అధికారులు సర్వేల పేరుతో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా చేయడం పద్ధతిగా లేదని మండిపడ్డారు. డ్వాక్రా మహిళలకు మాయమాటలు చెప్పి రూ.10 వేలు రుణమాఫీ చేస్తామని చెప్పి దానిని విడతల వారీగా వారి ఖాతాల్లోకి మళ్లీస్తామన్నారు. ఇంతవరకు ఎంతమందికి రుణమాఫీ వర్తించిందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల ముందు మరోసారి గారఢీ చేసి ప్రజలను మభ్యపెట్టేందుకే జన్మభూమి అంటూ టీడీపీ డ్రామాలు ఆడుతుందన్నారు.

మరిన్ని వార్తలు