మహిళలపై ప్రభుత్వం కీచకపర్వం

21 Dec, 2015 01:36 IST|Sakshi
మహిళలపై ప్రభుత్వం కీచకపర్వం

వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి
 
 ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : మహిళలపై రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం కీచకపర్వం అవలంభిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలపై పోలీసులతో దౌర్జన్యం చేయించిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ఆడపడుచుల ఆదరణ కావాలంటూ మొసలి కన్నీరు కార్చిన చంద్రబాబు, ఎన్నికల్లో గెలిపించి అధికారంలో కూర్చోబెట్టిన రాష్ట్ర మహిళల పట్ల హింసాప్రవృత్తితో వ్యవహరించడం దారుణమన్నారు.
 
  కాల్‌మనీ పేరిట మహిళలను అసభ్యంగా వీడియోల్లో చిత్రించి బ్లాక్‌మెయిల్ చేస్తూ వ్యభిచారంలోకి దింపిన టీడీపీ నాయకులను రక్షించుకోవడానికి చంద్రబాబు కుయుక్తులు పన్నారన్నారు. ఆ అంశాన్ని పక్కదారి పట్టించడానికి రాష్ట్రం అంతా దాడులు జరిపించి అమాయకులను అదుపులోకి తీసుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పోకడల కారణంగా అనాగరిక వ్యవస్థ నడుస్తోందని, ఏ ఒక్క వర్గానికీ ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందన్నారు. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టించడానికి వెనుకాడని ప్రభుత్వం, తమ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలపై నోరు మెదపకపోవడం ప్రజలకు తప్పుడు సంకేతాలు అందిస్తోందన్నారు.
 
 తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను సభ నుంచి సస్పెండ్ చేయడం ప్రభుత్వ పలాయన వాదానికి తార్కాణమన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకుల గొంతు నొక్కడం ద్వారా ప్రభుత్వం తనను తాను రక్షించుకోజూస్తోందని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఒక మహిళా ఎమ్మెల్యే ప్రశ్నల పరంపర నుంచి ప్రభుత్వం పారిపోతోందని ఎద్దేవా చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ అధినేత జగన్ నేతృత్వంలో ప్రజాసమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు.
 

>
మరిన్ని వార్తలు