రైతులంటే అంత చులకనా?

28 Jan, 2018 08:43 IST|Sakshi

మండపేట: వరి సాగు చేసే రైతులు సోమరిపోతులంటూ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌ సీపీ నేతలు మండిపడ్డారు. ‘ఎండనక, వాననక, రేయనక, పగలనక, ఆరుగాలం శ్రమించి అన్నం పెట్టే రైతులంటే అంత చులకనా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, రైతు విభాగం రాష్ట్ర నేతలు కొవ్వూరి త్రినాథరెడ్డి, వెంకటేశ్వరరావు, రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు) శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వరి, సుబాబుల్‌ పండించే రైతులు సోమరిపోతులంటూ మంత్రి ఉమ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. త్రినాథరెడ్డి మాట్లాడుతూ, గతంలో వ్యవసాయం దండగని చెప్పిన సీఎం చంద్రబాబు బాటలోనే మంత్రులు నడుస్తున్నారని విమర్శించారు.

ఇప్పటికే రాష్ట్రంలో వరిసాగు నానాటికీ తగ్గిపోతోందని, ఖరీఫ్‌లో 17.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు గాను 14.33 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగిందని చెప్పారు. రబీలో 8 లక్షల హెక్టార్లలో సాగుకు వీలుండగా 5.7 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారన్నారు. ఈ పరిస్థితి పాడి, పౌల్ట్రీ, రైస్, తవుడు మిల్లులు, చేపల పెంపకం తదితర అనుబంధ పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీస్తోందని త్రినాథరెడ్డి వివరించారు. వరికి బదులుగా డెల్టా భూముల్లో మెట్ట భూముల్లో పండించే పంటలను పండించాలని మంత్రి ఉమ చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఇప్పటికే కంది, పెసలు, మినుము, సుబాబుల్, యూకలిప్టస్‌ తదితర పంటలకు కనీస మద్దతు ధర లేక రైతులు అగచాట్లు పడుతున్నారన్నారు.

 ప్రకాశం కుడి కాలువ పరిధిలో నాలుగేళ్లుగా పంటలు లేవని, ఎడమ కాలువలోను సాగు విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాభిరామయ్య చౌదరి మాట్లాడుతూ, రైతులు వరి పండించడం మానేస్తారని, ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్‌ చేశారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అన్నదాతలను మోసగించేవిధంగా చంద్రబాబు సర్కారు పని చేస్తోందని అన్నారు. రాజుబాబు మాట్లాడుతూ, రైతులంటే టీడీపీ ప్రభుత్వానికి ఉన్న చులకన భావనను అందరూ గమనించాలన్నారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి ఉమను డిమాండ్‌ చేశారు. సొసైటీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి (చినకాపు), పార్టీ నాయకులు మహంతి అసిరినాయుడు, శెట్టి నాగేశ్వరరావు, తాడి రామారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు