రైతు దీక్షకు శ్రీకాకుళం నేతలు

31 Jan, 2015 09:14 IST|Sakshi

శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న రైతుదీక్షల్లో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివెళుతున్నారు. శని, ఆదివారాల్లో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరగనున్న ఈ దీక్షకు శుక్రవారం నాడే పలువురు బయలుదేరి వెళ్లగా, శనివారం ఉదయం వెళ్లేందుకు చాలామంది ఏర్పాట్లు చేసుకున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పాలకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఏ ఒక్క హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయకపోవడం, రైతన్నలు, మహిళలకు రుణమాఫీ విషయాల్లో జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ఈ దీక్షకు రైతులు, సామాన్యుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. రైతు దీక్షలో పాల్గొనేందుకు శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి సహా ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, కలమట వెంకటరమణలు బయల్దేరారు. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు రెండు రోజుల ముందే తణుకు చేరుకుని కార్యక్రమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, పార్టీ అధికార ప్రతినిధి, హై పవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం దీక్షాస్థలికి చేరుకోనున్నారు. సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి నర్తు రామారావు తదితరులు శుక్రవారం రాత్రి దీక్షకు తరలివెళ్లారు. పార్టీ కార్యకర్తలు కోరాడ రమేష్ సహా పెద్ద సంఖ్యలో రైళ్లు, బస్సులు, టాక్సీలు, వ్యాన్లలో వెళ్లారు. ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి గొర్లె కిరణ్ సహా చాలామంది శనివారం తెల్లవారుజామున దీక్షకు బయల్దేరనున్నట్టు జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తెలిపారు. మోసపూరిత హామీలిచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధం కావాలని ఆమె పిలుపు నిచ్చారు.
 
పార్టీ సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం నివాసంలో శుక్రవారం ఆమె ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశమై రైతుదీక్షకు వెళ్లే అంశంపై చర్చించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మోసపూర్తి వాగ్దానాలతో అధికారుంలోకి వచ్చిన చంద్రబాబు, అనంతరం వాటిని విస్మరించడంపై తమ పార్టీ నాయకుడు జగన్‌మోహన్ రెడ్డి పోరాటం సాగిస్తున్నారని తెలిపారు. రైతుదీక్షకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని, తణుకులో జరిగే రైతు దీక్షకు జిల్లా నుంచి ప్రజలు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లాలని కోరారు.

మరిన్ని వార్తలు