బీసీలకు మరోసారి అవకాశం 

17 Mar, 2019 07:27 IST|Sakshi
సింగరి సంజీవ్‌కుమార్‌

సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్‌ అభ్యర్థిగా డాక్టర్‌ సింగరి సంజీవ్‌కుమార్‌ను ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. అందులో కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి డాక్టర్‌ సింగారి సంజీవ్‌కుమార్‌ను పోటీకి నిలుపుతున్నట్లు వెల్లడించారు.

బీసీ (పద్మశాలి) వర్గానికి చెందిన డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ కర్నూలులోని ఆయుస్మాన్‌ హాస్పిటల్‌ అధినేతగానూ ఉన్నారు. ఈయన కర్నూలు మెడికల్‌ కాలేజీలోనే వైద్యవిద్యను అభ్యసించారు. యురాలజిస్టుగా రాణించడమే కాకుండా ఆనంద జ్యోతి ట్రస్టు ద్వారా సామాజిక సేవ కూడా చేస్తున్నారు. ఇక కర్నూలు పార్లమెంట్‌ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లోనూ బీసీ (బుట్టా రేణుక)కే ఆ పార్టీ సీటు కేటాయించింది. మరోసారి బీసీలకు ఈ సీటును కేటాయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు బీసీల పార్టీ అని చెప్పుకునే అధికార టీడీపీ మాత్రం ఈ సీటు వారికి కేటాయించకుండా.. ఉన్న సీట్లను సైతం లాక్కునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

ఒకే కుటుంబం నుంచి 21 మంది డాక్టర్లు 
డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ తండ్రి సింగరి శ్రీరంగం. ఈయనకు మొత్తం ఆరుగురు (ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు) సంతానం. వీరందరూ డాక్టర్లే. అంతేకాకుండా వీరి పిల్లలు.. అంతా కలిపి మొత్తం 21 మంది డాక్టర్లుగా రాణిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు