ఇదేం ‘శిక్ష’ణ..? 

12 Feb, 2018 16:06 IST|Sakshi

యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్లపై ప్రైవేటు పెత్తనం 

నిర్వహణపై దృష్టి సారించని యంత్రాంగం 

తెరుచుకోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం 

నిరుద్యోగులకు ఉపాధి చూపని శిక్షణలు

భద్రాచలం : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలు సవ్యంగా కొనసాగటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్లను(వైటీసీ) ప్రైవేటు సంస్థలకు అప్పగించటంతో సరైన ఫలితాలు రావటం లేదు. శిక్షణ పేరుతో నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నా యువతకు ఉపాధి లభించటం లేదు. ఈ కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో నామమాత్రంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన వివిధ శిక్షణ కేంద్రాలను ‘సాక్షి’ పరిశీలించగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో గ్రామ్‌ తరంగ్‌ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న కేంద్రంలో ఒక్క జేడీఏ(జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌) కోర్సులో మాత్రమే విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.

ఆదివారం ఈ కేంద్రాన్ని పరిశీలించగా 10 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పటి వరకు 360 మందికి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చినట్లు కేంద్రం కో– ఆర్డినేటర్‌ రవితేజ తెలిపారు. కానీ ఇందులో సేంద్రియ వ్యవసాయ సాగు, కోళ్ల పెంపకం వంటి అంశాల్లోనే సుమారు 240 మందికి శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్‌ తర్వాత ప్లేస్‌మెంట్‌(ఉద్యోగం) చూపించాలనే నిబంధన ఉండటంతో ఇటువంటి వాటికే ఎక్కువ శ్రద్ధ చూపుతన్నారనే విమర్శ ఉంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో కేంద్రం నడిచిన సమయంలో దీనికి ఫర్నిచర్, ఇతర సామగ్రి పెద్ద ఎత్తున సరఫరా చేయగా, అవన్నీ గదుల్లో వృథా గా కనిపిస్తున్నాయి. జిల్లాలో 50 వేల మందికిగా పైగా నిరుద్యోగ అభ్యర్థులు ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో నమోదు చేసుకున్నప్పటికీ, ఇక్కడికి మాత్రం అభ్యర్థులు రాకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే గతంలో వచ్చిన అభ్యర్థులే మళ్లీ మరో కోర్సుకు వస్తుండటం గమనార్హం. అంటే శిక్షణ అనంతరం ప్లేస్‌మెంట్‌ సవ్యంగా జరగడం లేదని దీన్ని బట్టి తెలుస్తోంది. కేంద్రం నిర్వహణపై కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు దృష్టి సారించాలని గిరిజన సంఘాల వారు కోరుతున్నారు.  

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం అస్తవ్యస్తం..
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్న సమయంలో మంజూరైన నిధులతో భద్రాచలం, కొత్తగూడెం, వాజేడులో టైలరింగ్‌ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా ప్రాంతాల్లో గల ఐటీఐ ప్రిన్సిపాల్స్‌కు అప్పగించారు. ఒక్కో కేంద్రానికి రూ.50 లక్షలు మంజూరు కాగా, ఇందులో రూ.35 లక్షలతో భవనాలు నిర్మించారు. మిగతా నిధులతో టైలరింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. అయితే ఆ భవనాన్ని వృథాగానే వదిలేసి భద్రాచలం డిగ్రీ కాలేజీ సమీపంలోని గిరిజన బాలికల సెల్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌ ప్రాంగణంలో ఓ మూలకు ఉన్న రేకుల షెడ్లలో టైలరింగ్‌ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న వారిలోనూ ఎక్కువ మంది ఉద్యోగుల కుటుంబసభ్యులు, గృహిణులు, వివిధ కోర్సుల్లో ప్రస్తుతం చదువుతున్న వారే ఉన్నారు.   

కొత్తగూడేనికి భవిత సెల్‌... 
గిరిజన యువతకు అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా ఐటీడీఏలో ‘భవిత సెల్‌’ ఏర్పాటు చేశా రు. నిరుద్యోగ గిరిజన యువత ఇక్కడ పేరు నమోదు చేసుకుంటే చాలు, వారి చెంతకే ఉపా ధి, ఉద్యోగ అవకాశాల సమాచారం చేరేలా ప్ర త్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఐటీడీఏ ప్రాంగణంలోనే ఉన్న యూత్‌ ట్రైనింగ్‌ సెంట ర్‌లో వివిధ పోటీ పరీక్షల కోసం గిరిజన అభ్యర్థులకు వరుసగా ఉచిత శిక్షణలు ఇప్పించారు. కానీ నేడు సీన్‌ మారిపోయింది. యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లు ప్రైవేటు సంస్థలకు అప్పగించటంతో ‘భవిత సెల్‌’ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న జాబ్‌ రిసోర్స్‌ పర్సన్‌(జేఆర్‌పీ)లకు పనిలేకుండా పోయింది. దీంతో ఈ కేంద్రాన్ని నేడో, రేపో భద్రాచలం నుంచి కొత్తగూడెం తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. దీని బాధ్యతలను పర్యవేక్షించే ఏపీఎం స్థాయి అధికారి ఇప్పటికే కొత్తగూడెం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. దీంతో దీనిని ఇక్కడి నుంచి మార్చేందుకు అంతా సిద్ధమైంది. ఇదే జరిగితే శిక్షణలపై ఇక పూర్తిగా ప్రైవేటు పెత్తనం సాగనుంది.  

గిరిజన నిరుద్యోగులు 50 వేలకు పైనే.. 
 భద్రాచలం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో తాజా లెక్కల ప్రకారం 50 వేల మందికి పైగానే పేర్లు నమోదు చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంత గిరిజన అభ్యర్థులు తమ విద్యార్హతలను భద్రాచలంలోని ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలోనే నమోదు చేసుకోవాలి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాలు ఏజెన్సీ పరిధిలోనే ఉండటంతో ఇక్కడ నమోదయ్యే గణాంకాలనే అధికారులు పరిగణలోకి తీసుకుని, నిరుద్యోగుల లెక్క చూపుతారు. ఇలా నమోదు చేసుకున్న వారిలో పదో తరగతి విద్యార్హతతో సుమారు 21 వేల మంది, ఇంటర్‌తో 13,500 మంది, డిగ్రీ పట్టభద్రులు 7,800 మంది ఉన్నారు. పదో తరగతి లోపు చదువుకున్న వారు 3 వేల మంది ఉండగా, వీరితో పాటు నర్సింగ్, వివిధ రకాల టెక్నికల్‌ కోర్సులు చేసిన వారు కూడా వేలల్లోనే ఉన్నారు.  కానీ ఇక్కడ పేరు నమోదు చేసుకోవటమే తప్ప అర్హులైన వారికి, కనీసం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై సమాచారం కూడా రావటం లేదు.  

ఉపాధి చూపని కోర్సులు... 
యువతకు సత్వర ఉపాధి దొరికేలా ఆయా ప్రాంతాల్లో డిమాండ్‌ ఉన్న కోర్సుల్లోనే గతంలో శిక్షణ ఇచ్చేవారు. ప్లంబింగ్‌ అండ్‌ రాడ్‌ బైండింగ్, వెల్డింగ్, ఎలక్ట్రీషియన్‌ అండ్‌ హౌస్‌వైరింగ్, బోర్‌ వెల్‌ రిపేర్, ఎంబ్రాయిడరీ అండ్‌ టైలరింగ్, కంప్యూటర్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెబైల్‌ సర్వీసు, రిపేరింగ్‌ వంటి కోర్సుల్లో శిక్షణ ఇచ్చే వారు. మూడు నెలల పాటు ఉచిత భోజన వసతి సదుపాయాలను కల్పించి, శిక్షణ ఇవ్వటంతో పాటు, కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత స్వయంగా ఉపాధి పొందేలా ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా రుణ సదుపాయం కూడా కల్పించేవారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్కో కేంద్రం నుంచి ఏడాదికి 400 మందికి పైగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చే వారు. కానీ  ప్రస్తుతం ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహిస్తున్న కేంద్రాల్లో నిర్వాహకులకు అనువుగా ఉన్న కోర్సుల్లోనే శిక్షణ ఇస్తున్నారు. ఈ కారణంగా నిరుద్యోగ యువత వీటిపై ఆసక్తి చూపటం లేదు.

మరిన్ని వార్తలు